పవిత్ర గంగే.. పావన తుంగే

Huge Devotees Attend To Tungabhadra Pushkar Ghats In AP - Sakshi

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుంగభద్ర పుష్కరాలకు పోటెత్తిన భక్తులు 

కర్నూలులో అంధులకు పుష్కర భాగ్యం కల్పించిన పోలీసులు 

కర్నూలు (సెంట్రల్‌): వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుంగభద్ర పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. ‘పవిత్ర గంగే.. పావన తుంగే నమోస్తుతే’ అంటూ నదీమ తల్లికి వాయనాలు సమర్పించారు. 8వ రోజైన శుక్రవారం కూడా కర్నూలు జిల్లాలోని 23 ఘాట్లలో భక్తులు పుష్కర పూజలు నిర్వహించారు. కర్నూలు సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప ఆధ్వర్యంలో అమ్మ, అక్షిత భవన్‌ పాఠశాలలు, నేషనల్‌ బ్‌లైండ్‌ ఫెడరేషన్‌కు చెందిన అంధులకు పుష్కర స్నానం ఆచరించే అవకాశం కల్పించారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తూ అంధ విద్యార్థులు పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని తలపై సంప్రోక్షణ చేసుకున్నారు. యాగశాలలో నిర్వహిస్తున్న హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం వారికి బెడ్‌షీట్లు, స్వీట్‌ ప్యాకెట్లను ఎస్పీ ఫక్కీరప్ప, డీఎస్పీ కేవీ మహేష్‌ అందజేశారు.  

సకల సంపదలు, సౌభాగ్యాల కోసం హోమం 
సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన హోమాన్ని పుష్కర స్నానాల కోసం వచ్చిన మహిళలు కనులారా వీక్షించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఈ హోమం వల్ల మహిళలకు సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని, రాష్ట్రంలోని మహిళలంతా సుఖ, శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని నిర్వహించినట్టు వేద పండితుడు చెండూరి రవిశంకర్‌ అవధాని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top