
హంసల దీవి తీరానికి బారులు తీరిన వాహనాలు
కోడూరు (అవనిగడ్డ): మాఘపౌర్ణమిని పురస్కరించుకొని సింధుస్నానాలు ఆచరించేందుకు భక్తులు హంసలదీవి సాగరతీరానికి పోటెత్తారు. వేలాది వాహనాల రాకతో కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామ రహదారులన్ని కిక్కిరిశాయి. దీంతో రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
సముద్ర రహదారి వెడల్పు చిన్నది కావడంతో వన్‌వే ట్రాఫిక్‌ను పోలీసులు అమలు చేశారు. దీంతో పాలకాయతిప్ప గ్రామం నుంచి హంసలదీవి వరకు, దింటిమెరక రహదారిలో సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి బారులు తీరాయి. బీచ్ వద్ద కూడా అధికారులు వాహనాలను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది.