జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా దరఖాస్తులు | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు భారీగా దరఖాస్తులు

Published Sat, May 18 2024 6:03 AM

Huge applications for JEE Advanced

11 ఏళ్ల తర్వాత ఏకంగా 1.91 లక్షల మంది నమోదు

26న దేశవ్యాప్తంగా పరీక్ష

ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డులు 

రాష్ట్రం నుంచి పరీక్ష రాయనున్నవారు 21,844

గతేడాది భారీగా పెరిగిన కటాఫ్‌ మార్కులు

23 ఐఐటీల్లో మొత్తం 17,385 సీట్లు

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్‌ కోర్సులకు దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 ఏళ్ల తర్వాత గరిష్టంగా 1.91 లక్షల మంది పరీక్షకు నమోదు చేసుకున్నారు. 

గతేడాది ఈ పరీక్షకు 1,89,744 మంది దరఖాస్తు చేశారు. సాధారణంగా జేఈఈ మెయిన్‌లో ప్రతిభ చూపినవారిలో టాప్‌ 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో రెండేళ్ల కిందటి వరకు 60 శాతం మంది కూడా అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారి సంఖ్య ఏకంగా 76 శాతానికి పెరిగింది. 

ఉత్తీర్ణత శాతం తక్కువే..
అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు నమోదు చేసుకున్నవారితో పోలిస్తే హాజరయ్యేవారి సంఖ్య ఏటా తక్కువగానే ఉంటోంది. అలాగే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణులయ్యేవారి సంఖ్య కూడా స్వల్పమే. గత కొన్నేళ్లుగా పరీక్షలకు సంబంధించి కటాఫ్‌ మార్కులతో పాటు ఉత్తీర్ణత శాతం కూడా తగ్గుతూ వచ్చింది. జనరల్‌తో పాటు రిజర్వుడ్‌ కేటగిరీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. గతేడాది అత్యధికంగా 1.80 లక్షల మందికి పైగా పరీక్ష రాస్తే 43,773 మంది మాత్రమే అర్హత సాధించారు. 

గతేడాది కటాఫ్‌ కూడా బాగా పెరిగింది. ఇక అడ్వాన్స్‌డ్‌లో పురుషులతో పోలిస్తే మహిళల హాజరు, ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వంటి పరీక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని, వాటిలో అర్హత సాధించాలంటే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్‌ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.  

రెండు సెషన్లలో పరీక్ష
దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆన్‌లైన్‌లో అడ్మిట్‌ కార్డులను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 

దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21,844, తెలంగాణ నుంచి 24,121 మంది అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన 2.50 లక్షల మందిలో సుమారు 60 వేల మందికిపైగా పరీక్షకు దరఖాస్తు చేయలేదు. వారు 12వ తరగతి/ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించలేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement