
అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టీకరణ
అసలు ఈ వ్యాజ్యంపై ఎందుకు విచారణ జరపాలో చెప్పండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా ఇవ్వం
ప్రచారం కోసం ఈ వ్యాజ్యాన్ని వేశారా.. అన్న దానిపై విచారణ జరుపుతాం
జగన్‌పై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ పిల్ దాఖలు చేసిన పిటిషనర్‌పై ప్రశ్నల వర్షం
ఢిల్లీ నుంచి సొంత డబ్బుతో వచ్చి వాదనలు వినిపించడంపై ఆశ్చర్యం
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వ హయాంలో అక్రమాల వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. శ్వేత పత్రాల ఆధారంగా సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించడమేంటంటూ ప్రశ్నించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రచారం, స్వప్రయోజనాల కోసం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారా? అన్న కోణంలో కూడా విచారణ జరపాల్సి ఉందని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సరిగా దర్యాప్తు చేయడం లేదని ఎలా చెబుతారని.. అందుకు ఏం ఆధారాలున్నాయని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసిన విధానం ఎంత మాత్రం సరిగా లేదంది. అసలు ఈ వ్యాజ్యంపై ఎందుకు విచారణ జరపాలో కూడా చెప్పాలంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ తదితరులపై కేసుకు పిల్
గత ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని, ఇందుకు సంబంధించి అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఉండేందుకు వారి దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రముఖ విశ్రాంత న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సిట్ వేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ తదితరులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు సామర్థ్యం లేదు
ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ మెహక్ మహేశ్వరి వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీలో పలు శ్వేత పత్రాలు విడుదల చేసిందన్నారు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరిగినట్లు అందులో పేర్కొన్నారని తెలిపారు. అందువల్ల సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతున్నామని ఆయన చెప్పారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఏ విషయంపై దర్యాప్తు జరగడం లేదని మీరు భావిస్తున్నారని మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని, అయితే అందులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు లేరన్నారు. కేసు దర్యాప్తు చేసేంత సామర్థ్యం రాష్ట్ర దర్యాప్తు సంస్థలకులేదన్నారు.
మరో సిట్ ఎందుకు?
ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులతో మరో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. శ్వేత పత్రాల ఆధారంగా ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేమంది. ప్రచారం, స్వీయ ప్రయోజనాల కోసం దాఖలు చేసే పిల్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఈ వ్యాజ్యం కూడా అదే కోవలోకి వస్తుందా? లేదా? అన్న దాన్ని తాము పరిశీలించాల్సి ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ మెతక వైఖరిని అవలంభిస్తోందని, మాజీ సీఎం పట్ల ఉదారంగా వ్యవహరిస్తోందని మీరు అనుకుంటున్నారా? అంటూ మెహక్ మహేశ్వరిని ప్రశ్నించింది.
ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారు?
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, మీరు బిజీ న్యాయవాది అయి ఉండీ, ఇలా పిల్ దాఖలు చేయడం, ఢిల్లీ నుంచి వచ్చి స్వయంగా వాదనలు వినిపించడం, మీ సొంత డబ్బును ఇందుకోసం వెచ్చించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతోందని వ్యాఖ్యానించింది. మెహక్ స్పందిస్తూ, నిజంగా అవినీతి జరిగిందా? లేక రాజకీయ ప్రేరణతో సిట్ ఏర్పాటు అయిందా? అన్న విషయం తనకు తెలియదన్నారు. ఏమీ తెలియనప్పుడు మీరెలా దర్యాప్తు కోరతారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఏడాదిగా మద్యం కేసులో మాత్రమే దర్యాప్తు చేస్తున్నారని మహేశ్వరి తెలిపారు. నిందితుల జాబితాలో అప్పటి సీఎం జగన్‌ని చేర్చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సి.ప్రణతి స్పందిస్తూ, ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 11కి వాయిదా వేసింది.