గురువారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారిన గుంటూరులోని లాడ్జ్ సెంటర్
పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1
డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. అమరావతిలో 46, విజయవాడలో 45.5 డిగ్రీలు
అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అసాధారణ స్థాయికి చేరింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రాష్ట్రం అగ్ని గుండంగా మారింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గురువారం గరిష్టంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 18 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పల్నాడు, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, బాపట్ల, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో 46 డిగ్రీలు, విజయవాడలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే నమోదైన ఉష్ణోగ్రతల కంటే 3–4 డిగ్రీలు ఎక్కువగా ఎండ ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవడంతో విపరీతమైన ఉక్కపోతతో ఈ పరిస్థితి నెలకొంది.
ఎండకు వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే 4 రోజులూ ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించింది.

నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండే జిల్లాలు..
శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాకినాడ, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్లూరి, పోలవరం, నెల్లూరు, రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


