
సాక్షి,అమరావతి: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తికొండకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ పఠాన్‌పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు పఠాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదే అంశంపై పఠాన్ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
పఠాన్ కరీం మీ దగ్గరే ఉన్నారా?అని పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు తమ ఆధీనంలోనే ఉన్నారంటూ పోలీసులు తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ కేసులున్నాయని.. వాటిని రాజీ చేయించేందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీంతో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ అధికారంతో కేసును విత్‌డ్రా చేస్తారని ప్రశ్నించింది. ఈ కేసును తానే విచారిస్తానని.. మంగళవారం పఠాన్ కరీంను తమ ముందు హాజరు పరచాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి వరకు పఠాన్‌ను తహసిల్దార్ వద్ద ఉంచాలని పోలీసులకు ఆదేశించారు.
