
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
తిరుపతి జిల్లాలో 3 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
కర్నూలు(అగ్రికల్చర్)/వాకాడు: అల్పపీడన ప్రభావంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రధానంగా గూడూరు, మద్దికెర మండలాల్లో కుండపోత, మిగిలిన మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గూడూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఫలితంగా హంద్రీకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా గూడూరులో 99 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పత్తి, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది.
గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని వక్కెర వాగు పొంగిపొర్లడంతో ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సి.బెలగల్ మండలంలోని పోలకల్ గ్రామ శివారులో ఉన్న జక్కులోని వాగు నిండుగా ప్రవహించింది. ప్రయాణికులతో వెళ్లిన ఆర్టీసీ బస్సు వాగు నీటి ఉద్ధృతికి మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు.
మరోవైపు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రం గురువారం 3 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అలల తాకిడికి తీరానికి వచ్చిన పర్యాటకులు వెనుతిరిగి వెళ్లారు. ఉదయాన్నే వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రం ఆటు పోటులతో వేట చేయలేక ఖాళీ బోట్లతో మధ్యాహా్ననికి ఒడ్డుకు చేరుకున్నారు.