
అల్లూరి జిల్లా చింతూరు మండలంలో నాటు పడవలో సోకిలేరు వాగు దాటుతున్న ప్రజలు
7 జిల్లాల్లో కుండపోత
24 గంటల వ్యవధిలో అల్లూరి జిల్లా పాడేరులో 16.1 సెం.మీ. వర్షం
పొంగుతున్న వాగులు, వంకలు
1.83 లక్షల ఎకరాల్లో నీటమునిగిన పంటలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గుళ్ల సీతారామపురంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 6, అల్లూరి జిల్లా కొత్తూరులో 5.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
24 గంటల్లో పాడేరులో 16.1 సెం.మీ. వర్షం
అంతకుముందు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 16.1 సెం.మీ. వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5, మాడుగుల, కె.కోటపాడులో 15 సెం.మీ. చొప్పున వర్షం పడింది. విశాఖ జిల్లావ్యాప్తంగా సగటున 24 గంటల వ్యవధిలో 12.5 సెం.మీ., అనకాపల్లి జిల్లాలో సగటున 10.7 సెం.మీ. వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో 5.8, అల్లూరి జిల్లాలో 5.1, శ్రీకాకుళం జిల్లాలో 4.4, కాకినాడ జిల్లాలో 4 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
అల్లూరి జిల్లా అతలాకుతలం
చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అల్లూరి జిల్లాలో వాగులు పొంగుతుండటంతో పలుచోట్ల రహదారుల పైకి వరదనీరు చేరుతోంది. కూనవరం మండలంలో కొండ్రాజుపేట కాజ్‌వే పైకి నీరు చేరడంతో 7 గ్రామాలకు, వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు కాజ్‌వే కూలిపోవడంతో 42 గ్రామాలకు, చింతరేగుపల్లి వద్ద వరదనీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చింతూరు మండలంలో కుయిగూరువాగు పొంగి వరద నీరు ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై ప్రవహిస్తుండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు స్తంభించాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగులు సైతం పొంగడంతో చింతూరు మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల చిన్న వంతెనలు కొట్టుకుపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి.
1.83 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం
గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎనీ్టఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరితో పాటు 14 జిల్లాల్లోని 828 గ్రామాల్లో 1.83 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. 1.50 లక్షల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, సజ్జలు, కందులు, వేరుశనగ, పెసలు, మినుము పంటలు ముంపుబారిన పడ్డాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 72 వేల ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 41 వేల ఎకరాలు, పశి్చమ గోదావరిలో 19 వేల ఎకరాలు, కృష్ణాలో 17 వేల ఎకరాలు, ఎనీ్టఆర్ జిల్లాలో 12 వేల ఎకరాలు ముంపునకు గురైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో 22 వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. కాగా, భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎస్ కె.విజయానంద్‌తో సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
నేడు తీరం దాటనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో విశాఖకు సమీపాన ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం నుంచి దూరంగా కదిలి వెళ్లింది. ప్రస్తుతం ఒడిశాకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఒడిశా సమీపంలో తీవ్ర అల్పపీడనంగా మారి.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 38 కి.మీ. దూరంలో, కళింగపటా్ననికి ఈశాన్యంగా 110 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. మంగళవారం వేకువజామున మధ్యాహ్నం గోపాల్‌పూర్ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. కాగా.. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం వరకూ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఉంటుందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
24న మరో అల్పపీడనం!
ప్రస్తుత తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో ఇది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆ సమయంలో మళ్లీ వర్షాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు.