ఆటిజంకు 'స్టెమ్‌ సెల్‌ థెరపీ' నిషిద్ధం | Guidelines issued on stem cell therapy treatment | Sakshi
Sakshi News home page

ఆటిజంకు 'స్టెమ్‌ సెల్‌ థెరపీ' నిషిద్ధం

Mar 28 2026 3:39 AM | Updated on Mar 28 2026 3:39 AM

Guidelines issued on stem cell therapy treatment

ఈ చికిత్సతో సమస్య నయమవుతుందని రుజువు కాలేదన్న ఎన్‌ఎంసీ 

నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక 

స్టెమ్‌ సెల్‌ థెరపీ చికిత్సపై మార్గదర్శకాలు జారీ 

ఆటిజం పిల్లలకు స్టెమ్‌ సెల్‌ థెరపీ పేరుతో రూ.లక్షల్లో గుంజుతున్న ప్రైవేటు ఆస్పత్రులు  

సాక్షి, అమరావతి: ఆటిజం బాధిత చిన్నారులకు స్టెమ్‌ సెల్‌ థెరపీ (మూల కణ చికిత్స) పేరిట కార్పొరేట్‌ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. పిల్లలకు నయమైతే చాలన్న తల్లిదండ్రుల బాధను ఆసరాగా చేసుకుని రూ.లక్షల్లో గుంజుతున్నాయి. కానీ ఆటిజానికి ఈ చికిత్స సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తేల్చిచెప్పింది. 

ఆటిజంకు ఈ చికిత్స నిషిద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కేవలం క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా మాత్రమే ఈ చికిత్సను వినియోగించవచ్చని తెలిపింది. ఇందుకు రోగుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశించింది. ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన ఎన్‌ఎంసీ.. తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు మేరకు ఆటిజానికి స్టెమ్‌ సెల్‌ చికిత్స చేయడం చట్టవిరుద్ధమని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.  

32 రకాల వ్యాధులకు మాత్రమే.. 
స్టెమ్‌ సెల్‌ థెరపీని కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతించిన 32 రకాల వ్యాధులకు మాత్రమే ఉపయోగించాలి. పెద్దల్లో లుకేమియా, మైలోఫైబ్రోసిస్, మల్టిపుల్‌ మైలోమా, తీవ్ర రక్తహీనత, అప్లాస్టిక్‌ అనీమియా సహా 18 వ్యాధులకు మాత్రమే స్టెమ్‌ సెల్‌ చికిత్సను ఐసీఎంఆర్‌ ఆమోదించింది. అదేవిధంగా పిల్లల్లో లుకేమియా, తలసీమియా, వారసత్వంగా వచ్చే ఎముక మజ్జ వైఫల్య వ్యాధులు, ఈవింగ్స్‌ సార్కోమా, న్యూరోబ్లాస్టోమా సహా 14 రకాల వ్యాధులకు మాత్రమే ప్రామాణిక చికిత్సగా దీనిని ఐసీఎంఆర్‌ సిఫార్సు చేస్తోంది.  

రూ.లక్షల్లో దోపిడీ.. 
రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు స్టెమ్‌ సెల్‌ థెరపీతో ఆటిజం నయం అవుతుందంటూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఒక సిట్టింగ్‌కు రూ.3 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తాన్నే తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు ప్యాకేజ్‌లు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. 

ఇలా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా స్టెమ్‌ సెల్‌ థెరపీ పేరిట దోపిడీ సాగుతుంటే వైద్య, ఆరోగ్య శాఖ కనీసం పట్టించుకోవడం లేదంటూ చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement