
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి లాంటి యనమల రామకృష్ణుడు భాగస్వామ్యంతోనే గత సర్కారు రూ.లక్షల కోట్లు అప్పు చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు.
ప్రభుత్వ ఆర్థిక కష్టాలన్నింటికి యనమల, చంద్రబాబే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మూడేళ్లలో రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించి నేరుగా, పారదర్శకంగా అందించిందన్నారు. రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేసిన గత సర్కారు ఎవరికి ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.
యనమల నోటి పన్ను తొలగించుకునేందుకు రూ.2 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సింగపూర్ వెళ్లారని, లోకేష్ విమానాశ్రయాలలో జీడిపప్పు కోసం రూ.20 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. అప్పులపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడం తమ బాధ్యతన్నారు.
ఇప్పటం ప్రజలకు రూ.50 లక్షలిచ్చి మాట్లాడాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటంలో సభ నిర్వహించినప్పుడు గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారని మంత్రి అమర్‌నాథ్ గుర్తు చేశారు. ఆ సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత ఆ గ్రామానికి వెళ్తే బాగుంటుందని సూచించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే పవన్ కళ్యాణే కాదు, ఎవర్నైనా పోలీసులు అడ్డుకుంటారన్నారు.