
పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే తిరోగమనం
కొత్త ఆర్థిక సంవత్సరం రెండో నెలలోనూ తగ్గిన జీఎస్టీ వసూళ్లు
దేశవ్యాప్తంగా 13.66 శాతం పెరిగితే.. ఏపీలో మాత్రం 2.23 శాతం క్షీణత
మే నెల జీఎస్టీ ఆదాయం రూ.3,803 కోట్లకు పరిమితం
ఏప్రిల్, మే నెలల్లో 2.9 శాతం తగ్గుదల
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రెండో ఆర్థిక సంవత్సరం మొదలైనా ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా రోజురోజుకీ క్షీణిస్తోంది. ప్రజల వద్ద డబ్బుల్లేక వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు నేలచూపులు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే.. మన రాష్ట్రంలో ఏ నెలకానెల క్షీణిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం మే నెలలోనూ జీఎస్టీ వసూళ్లు 2 శాతానికి పైగా క్షీణించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది.
2024–25 ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.3,890 కోట్లు (ఎస్‌జీఎస్టీ సెటిల్‌మెంట్‌కు ముందు) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మే నెలలో 2.23 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు 13.166 శాతం పెరిగి.. రూ.1.31 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి.
దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాలు గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేయగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో పయనించడం గమనార్హం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక అయితే ఏకంగా 20 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. – సాక్షి, అమరావతి
12 శాతం పడిపోయిన నికర జీఎస్టీ
ఐజీఎస్టీ సెటిల్‌మెంట్ తర్వాత రాష్ట్రానికి నికరంగా వచ్చే జీఎస్టీ వసూళ్లలోనూ భారీ క్షీణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే నికర జీఎస్టీ వసూళ్లు 12 శాతం క్షీణించి.. రూ.6,149 కోట్ల నుంచి రూ.5,388 కోట్లకు పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు ఏప్రిల్, మే నెలల వసూళ్లను కలిపి చూస్తే 2.9 శాతం క్షీణత నమోదైంది. గతేడాది మొదటి రెండు నెలల జీఎస్టీ ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది 2.9 శాతం తగ్గి రూ.8,490 కోట్లకు పరిమితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

చివరకు బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు క్షీణిస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. సంక్షేమ పథకాలు ఆపేయడం, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అనేక కారణాలు రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మందగించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
