
బదిలీల చట్టంపై ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహం
సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకోలేదని నిరసన
పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు లోపభూయిష్టమంటూ మండిపాటు
ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ విభజించు పాలించు విధానం
గుర్తింపు సంఘాల నిరసనకు తోడు రిజిస్టర్డ్ సంఘాలూ సర్కారు తీరుతో అసంతృప్తి
ఈనెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పిలుపు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను రద్దుచేసి చంద్రబాబు కొత్తగా అమలుచేస్తున్న విధానాలు బూమరాంగ్ అవుతున్నాయి. సర్కారు ఏకపక్ష విధానాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ వర్గాల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల పునర్విభజన, టీచర్ల సర్దుబాటు తీరుపై వారు రగిలిపోతున్నారు. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిలోను.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో నియమించడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో.. దాదాపు ఎనిమిది నెలలుగా ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు వారం వారం సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
ఇలా ఇప్పటివరకు 34 సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్న విద్యాశాఖ.. వారి సూచనలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశానికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో వారు రగిలిపోతున్నారు. అంతేగాక.. జీఓ–117 రద్దు మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలకు, కొత్తగా తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు అసలు పొంతనలేదని దుమ్మెత్తిపోస్తున్నారు.
మిగులుగా 10వేల మంది ఉపాధ్యాయులు..
ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. ఇందుకనుగుణంగా మార్చిలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. దీంతోపాటు ఇటీవల మూడు జీఓలు విడుదలచేసి పాఠశాలల పునర్విభజన, ఉపాధ్యాయుల పంపిణీ ఎలా ఉంటుందో పేర్కొంది. ప్రభుత్వ నూతన విధానాలతో రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటుతో పాటు, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి అస్తవ్యస్తంగా మారింది.
10 వేల మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఏర్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ముందుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించి శుక్రవారం గుర్తింపు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసింది. కానీ, గతంలో జరిగిన సమావేశాల్లో తాము సూచించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
ఆది నుంచీ విభజించు– పాలించు విధానం..
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 43 సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో తొమ్మిది గుర్తింపు సంఘాలు కాగా, మరో 34 రిజిస్టర్డ్ సంఘాలున్నాయి. వీటిలో 1,78,984 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులతో సఖ్యతగా ఉన్నట్లు చెప్పుకునేందుకు గతేడాది సెప్టెంబరులో విద్యా సంబంధ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశాలకు కేవలం గుర్తింపు సంఘాల నాయకులను మాత్రమే ప్రభుత్వం ఆహ్వానించి, రిజిస్టర్డ్ సంఘాలను దూరం పెట్టింది. ఈ ఎనిమిది నెలల్లో రిజిస్టర్డ్ సంఘాలతో కేవలం రెండు సమావేశాలను మాత్రమే నిర్వహించింది. కానీ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. గుర్తింపు సంఘాల నుంచి శుక్రవారం మళ్లీ నిరసన సెగ తగలడంతో రిజిస్ట్‌ర్డ్ సంఘాలను మచ్చిక చేసుకునేందుకు వచ్చే బుధవారం ఆ సంఘాలతో చర్చలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించి వాటిని ఆహ్వానించింది. కానీ, ఈ సంఘాల నేతలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు.
ఉపాధ్యాయుల సర్దుబాటుపై తీవ్ర విమర్శలు..
ఇక గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ–117 ప్రకారం.. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1 : 20గా ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల సర్దుబాటు, కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో తొమ్మిది రకాల స్కూళ్లను ఏర్పాటుచేయడం ఒక ఎత్తయితే, చాలా పాఠశాలలను విలీనం చేయడంతో విద్యార్థులు బడులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. హైసూ్కళ్లల్లో 3–4 తరగతులున్నా సబ్జెక్టు టీచర్ విధానం రద్దుచేయడం, యూపీ స్కూళ్లల్లోను ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ప్రైమరీ స్కూళ్లల్లో టీచర్–విద్యార్థుల నిష్పత్తి 1 : 30గా ఉంటే మరికొని్నంటిలో 1 : 5గా ఉంది. ఈ సర్దుబాటు క్రమంలో ఉపాధ్యాయులు భారీగా మిగులుగా ఏర్పడుతున్నారు. దీంతో.. స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంలుగా నియమించడం, మరికొందరిని క్లస్టర్ పూల్‌లోను, ఇంకొందరిని హెచ్‌ఓడీ పూల్‌లోను పెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఒకరకంగా ఇది ఉపాధ్యాయులను గాలిలో పెట్టడమేనని వారంటున్నారు. ఇప్పటికే జిల్లాల్లో డీఈఓ పూల్ ఉండగా, దీనికి ఇవి అదనంగా జతచేయడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం గత ప్రభుత్వం 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధన అమలుచేస్తే ఇప్పుడు తొలగించడమేంటని, యూపీ స్కూళ్లల్లో సైతం స్కూల్ అసిస్టెంట్లను తొలగించి మిగులు చూపడం ఎందుకని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈనెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి.