కల్తీ కాటు.. సర్కారు స్పందన లేటు
2015 పుష్కరాల్లో గాలిలో కలిసిన 30 మందికి పైగా ప్రాణాలు
వచ్చే పుష్కరాలకు ఏడాది ముందు 16 మందిని బలిగొన్న కల్తీ పాలు
చావుబతుకుల మధ్య మరో నలుగురు
కల్తీ పాలే కారణమని ప్రభుత్వం గుర్తించడానికే వారం రోజులు
అదికూడా బాధిత కుటుంబాలు చెప్పడం వల్లే కల్తీ గుట్టురట్టు
ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఉంటే అందరి ప్రాణాలు దక్కేవి
కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో.. కిడ్నీ, ఊపిరితిత్తులు.. చివరకు గుండె ఆగి వరుస మరణాలు
వైఎస్సార్‌సీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లాకే స్పందించిన చంద్రబాబు
ఇప్పటికీ పాల కల్తీపై, మరణాలపై అనుమానాలెన్నో
ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టని ప్రభుత్వం
ఫిబ్రవరి 15న రాత్రి పాల రూపంలో చేతికందిన కాలకూట విషం తాగి ఆస్పత్రుల పాలయ్యారు. చివరకు కిడ్నీలు పాడై రోజుకొకరు, ఇద్దరు చొప్పున ఓ చిన్నారి సహా 16 మంది.. సర్కారు నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఇప్పటికే పాడెక్కారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు ఆస్పత్రుల్లోనే మరణ వేదన అనుభవిస్తుండగా.. వారి అవస్థల్ని చూడలేక ఆ కుటుంబాలు ఇప్పటికీ నరకయాతన పడుతున్నాయి. మొత్తానికి దేశంలోనే అత్యధిక ప్రాణాలను బలిగొన్న రాజమహేంద్రవరం ‘పాల’కూట విషపు మృత్యుఘోష ‘ఈ పాపం ఎవరిది బాబూ!’ అని బిగ్గరగా ప్రశ్నిస్తోంది.
చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్ల 2015 గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించగా.. మరో ఏడాదిలో రానున్న గోదావరి పుష్కరాలకు ముందు అదే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల కల్తీ పాల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని రాజమహేంద్రవరం వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. (యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఎస్.ఫయాజ్/రాజమహేంద్రవరం)
‘రాజమహేంద్రవరం పాల కల్తీ కాటుపై చంద్రబాబు సర్కారు స్పందించడం లేటయ్యింది. ఒకే సమస్యతో ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రుల్లో చేరినప్పుడే ప్రభుత్వం అప్రమత్తమై.. అందుకు కారణాలు నిర్ధారించి.. తక్షణ చర్యలు చేపట్టి ఉంటే 16 ప్రాణాలు నిలిచేవి. మరో నలుగురి ప్రాణాలు కొనఊపిరితో బిక్కుబిక్కుమనేవి కాదు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులు వారం రోజుల తర్వాత తమ అస్వస్థతకు కల్తీ పాలే కారణమని చెప్పాక.. ప్రభుత్వం తీరుబడిగా స్పందించింది.
వైఎస్సార్‌సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాకే చంద్రబాబు ఈ ఘటనపై స్పందించారు’ రాజమహేంద్రవరంలో ఎవరిని కదిపినా ఇవే మాటలు చెబుతున్నారు. బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. వారు చనిపోయాక అరకొర పరిహారం అందించినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అయిన వారిని కోల్పోయి.. ప్రైవేట్ వైద్యానికి రూ.లక్షలకు లక్షలు దొరికిన చోటల్లా అప్పులు చేసిన కుటుంబాలు నెల రోజులు గడిచినా మనోవేదన నుంచి బయటపడలేదు. బాధితుల కుటుంబ సభ్యులను కదిలిస్తే.. కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్న సన్నివేశాలు గుండెల్ని పిండేస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది
ఒక్కో కుటుంబానిదీ ఒక్కో విషాదం చౌడేశ్వరి నగర్‌లోని గుండాబత్తుల ఫణి మధుకుమార్ ఇంటిని విషాదం వెంటాడుతోంది. కల్తీ పాలకు ఆయన తల్లి వెంకటలక్ష్మి (70), పెద్దనాన్న గంటా సూర్యారావు (80), పిన్ని రఘుపతి సూర్యకుమారి (62) బలైపోయారు. మధు తండ్రి వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయనకు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. అయినా గ్యారంటీ లేదని వైద్యులు చెబుతున్నారు.
అదే ప్రాంతానికి చెందిన కుయ్యోటి ఛాయశ్రీ (54) కల్తీ పాలు తాగి ఫిబ్రవరి 16న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే రాజమహేంద్రవరం డెల్టా ఆస్పత్రిలో చేరి్పంచగా.. క్రియాటినిన్ పెరిగిపోవడంతో కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది. డయాలసిస్ చేసినా ఫలితం లేక కిడ్నీకి స్టెంట్ వేశారు. అయినా పరిస్థితి విషమించడంతో ఛాయశ్రీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆమె భర్త మురళీకృష్ణ నగరంలోని రవి చైతన్య ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20న ప్రాణాలు కోల్పోయింది.
ఆమె మరణాన్ని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోలేదు. అదేమంటే పోస్టుమార్టం చేయలేదనే సాకుతో పరిహారం ఎగ్గొట్టింది. ఇప్పటికే జయలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంక్ బోర్డు తిప్పేయడంతో ఆ బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు కోల్పోయానని, కొందరిని నమ్మి రూ.10 లక్షల అప్పులు ఇస్తే ఎగ్గొట్టారని మురళీకృష్ణ తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న తాను ఇప్పుడు భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానన్నారు.
అనుమానాలను నివృత్తి చేయని సర్కారు
పాలలో ఇథలీన్ గ్లైకాల్ కలవడమే బాధితుల మృతికి కారణమని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి కల్తీ పాలు, బాధితుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపినట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ల్యాబ్‌ల నుంచి వచి్చన వాస్తవ నివేదికలను ఇప్పటికీ రహస్యంగానే ఉంచింది. వాస్తవానికి ఇథలీన్ గ్లైకాల్ కలిస్తే పాలు నీలం రంగులోకి మారిపోతాయని.. అయితే, బాధితులు తాగిన పాలు రంగు మారలేదని చెబుతున్నారు. మరికొందరు గడ్డి మందు ఏమైనా కలిసిందేమో అంటున్నారు.
ఇంకొందరు పాల వ్యాపారం పోటీలో ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందితే పాలల్లో కల్తీ ఎలా జరిగింది?, ఏం కలిసింది?, బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేంటి? అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాల పదార్థాలు తీసుకోవాలన్నా, టీ తాగాలన్నా జనం వణికిపోతున్నారు. గణేష్ సరఫరా చేసిన పాల నుంచి వెన్న సేకరించి నెయ్యిగా దాచుకున్న వారు ఉన్నారని.. వారిని అప్రమత్తం చేయడం, పాల కల్తీపై అవగాహన కల్పించండంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు వాపోతున్నారు.
వైద్యానికే రూ.4.50 లక్షలైంది
ఇరిగేషన్ రిటైర్డ్ ఇంజినీర్ శేషగిరిరావు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన కుమారుడు, కోడలు విషయం తెలుసుకుని వచ్చి ఆయనను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైద్య ఖర్చులు రూ.4.50 లక్షలయ్యాయి. ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాల్సి ఉంది. భర్త బతికాడు.. భార్య ప్రాణం పోయింది శివరాత్రి రోజు రాత్రి కల్తీ పాలతో కాఫీ కలిపి బండారు వీరలక్ష్మి (60) తన భర్త నాగమోహనరావుకు ఇచ్చింది.
పాలు చేదుగా ఉన్నాయని గుర్తించిన భర్త ఆ కాఫీ తాగకుండా పారబోశారు. ‘కాఫీ పొడి ఎక్కువ వేసి ఉంటాను. అందుకే చేదుగా ఉందని చెప్పిన భార్య చేదు అనిపించినా కాఫీ తాగింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. తన భార్య కూడా ఆ కాఫీ తాగకుండా ఉంటే బతికేదని నాగమోహనరావు కన్నీరు మున్నీరవుతున్నారు.
ప్రసాదం తిని పాప బతికింది
లాలాచెరువు ప్రాంతానికే చెందిన జి.నాగవెంకటేష్ కు జైక్రిత్ రాజ్, జయ హిమాన్షి అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రెండున్నరేళ్ల వయసున్న వారిద్దరికి పాలు కలిపి ఇస్తే జైక్రిత్ తాగాడని.. అప్పటికే దేవుడి ప్రసాదం తిన్నందున జయ హిమాన్షి తాగలేదని చిన్నారుల తాతయ్య ప్రకాశరావు చెప్పారు. పాలు తాగి అస్వస్థతకు గురైన జైక్రిత్ రాజ్‌ను కాపాడుకునేందుకు అప్పులు చేసి ఎంత ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని అతడి తాతయ్య ఆవేదనతో చెప్పారు.
పరిహారంలోనూ పరిహాసమే
కల్తీ పాల ఘటనలో మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సైతం బాధిత కుటుంబాలను పరిహసిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అయితే, రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం మాత్రమే ఇచ్చిందని బాధితులు వాపోతున్నారు.
అయిన వారిని కోల్పోయిన వారికి పరిహారం పెంచాలని.. ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేసిన కుటుంబాలకు వైద్య ఖర్చులను తక్షణం చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ, ప్రజా సంఘాల నేతలు పదేపదే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
శేషజీవితం ప్రశాంతంగా గడుపుదామని వచ్చి..
విశాఖపట్నంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైరైన మంచి రాధాకృష్ణమూర్తి (72) శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు రాజమహేంద్రవరం వచ్చారు. కుమార్తెతోపాటు అయిన వారంతా ఇక్కడే ఉండటంతో ఆనందంగా గడపాలని భావించి ఇక్కడ స్థిరపడ్డారు. ఇటీవల కల్తీ పాలు తాగడంతో యూరిన్ ఆగిపోయి పరిస్థితి సీరియస్ అవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యానికి ఎంత ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని ఆయన కుమార్తె గడిశెట్టి వెంకటదుర్గ ఆవేదనతో తెలిపారు.
పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నాం
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ అమ్మను చూసేందుకు చిన్నపిల్లలతో సహా రాజమండ్రికి వచ్చిన తాము పాలు తాగకపోవడంతో ప్రాణాలతో ఉన్నామని వియ్యూరి రాజేష్ తెలిపారు. శివరాత్రికి రెండు రోజుల ముందే తాను కుటుంబంతో హైదరాబాద్‌కు, తన తమ్ముడు జగన్నాథ్ వైజాగ్‌లోని అత్తారింటికి వెళ్లాడని చెప్పారు.
శివరాత్రి తర్వాత రోజున తన తల్లి గొంతునొప్పి, చెవుల్లోంచి చీము కారడం, కళ్లు మంటలు ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందన్నారు. గోరువెచ్చని నీళ్లు తాగడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. తాము కూడా అక్కడే ఉంటే పాలు, మజ్జిగ, టీ తాగి ఉండే వాళ్లమని.. అదే జరిగితే తన రెండేళ్ల కుమారుడు, తన తమ్ముడి 7 నెలల కొడుకు పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తోందని రాజేష్ చెప్పారు.


