తప్పనిసరి అయితేనే కారుణ్య మరణం | Government guidelines on euthanasia drafted | Sakshi
Sakshi News home page

తప్పనిసరి అయితేనే కారుణ్య మరణం

Jul 9 2026 5:51 AM | Updated on Jul 9 2026 5:51 AM

Government guidelines on euthanasia drafted

ప్రభుత్వ మార్గదర్శకాల రూపకల్పన

పటిష్ట అమలుకు నిర్దేశాలు

సాక్షి, అమరావతి: జీవచ్ఛవంలా మారిన రోగులకు కారుణ్య మరణం (పాసివ్‌ యుథనేషియా) ప్రసాదించడం తప్ప మరే ఇతర అవకాశాలు లేని పరిస్థితుల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై  వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ మార్గదర్శకాలను ఆమోదించినట్లు వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బుధవారం తెలిపారు. తీవ్ర అనారోగ్యం పాలై కృత్రిమంగా, వైద్య పరికరాల (లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌/వెంటిలేటర్‌) సహాయంతో కొనసాగుతూ ఇక కోలుకునే అవకాశం లేదని వైద్యులు తేల్చినప్పుడు లైఫ్‌ సపోర్ట్‌ను తొలగించడం ద్వారా బాధితుడికి సహజంగా మరణించే అవకాశం కల్పించడాన్ని పాసివ్‌ యుథనేషియా అంటారు. 

13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన చండీఘడ్‌ యూనివర్సిటీ విద్యార్థి హరీష్‌ (32)కు ఇటీవల సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కారుణ్య మరణం మార్గదర్శకాల అమలు చేసే బాధ్యతను డీఎంఈ, డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు అప్పగించారు. 

విధివిధానాలు ఇలా..
»  రోగి పూర్తి స్పృహలో ఉన్నప్పుడు, ఎలాంటి నిర్బంధం లేకుండా భవిష్యత్తులో తనకు అందించాల్సిన చికిత్సపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక సంరక్షకుడు (గార్డియన్‌)కు అప్పగిస్తూ ఇద్దరు సాక్షుల సమక్షంలో వీలునామా రాయవచ్చు. దీనిని నోటరీ/గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించాలి.
» వ్యాధి, అనారోగ్య సమస్య నయం కాని స్థితికి చేరినప్పుడు.. కొనసాగుతున్న చికిత్సను ఆపివేయాలని వైద్యుడు భావిస్తే తొలుత గార్డియన్‌కు వివరించాలి.  
» ఇలాంటి సందర్భాల్లో చికిత్స అందిస్తున్న డాక్టర్‌తో పాటు, కనీసం 5 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మరో ఇద్దరు వైద్యులతో కూడిన ‘ప్రైమరీ మెడికల్‌ బోర్డు’ను ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు 48 గంటల్లోగా ప్రాథమిక నిర్ణయం తీసుకోవాలి.
» చికిత్స నిరుపయోగమని ప్రాథమిక బోర్డు నిర్ధారించిన అనంతరం డీఎంహెచ్‌వో.. ఆ చికిత్సతో సంబంధం లేని మరో ఇద్దరు వైద్యులతో కూడిన ‘సెకండరీ మెడికల్‌ బోర్డు’ను ఏర్పాటు చేయాలి.
» ఈ రెండు బోర్డుల అభిప్రాయాలను, గార్డియన్‌ సమ్మతి తీసుకుని లైఫ్‌ సపోర్ట్‌ను తొలగించే ముందు ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.  
» సెకండరీ మెడికల్‌ బోర్డు చికిత్స నిలిపివేతకు అంగీకరించకపోతే గార్డియన్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ సందర్భాల్లో హైకోర్టు 20 ఏళ్ల అనుభవమున్న వైద్యులతో  స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది.
» ఒకవేళ రోగి ముందస్తు వీలునామా ఇవ్వని పక్షంలో వైద్యుడి సమాచారం మేరకు ఆసుపత్రి వారే ప్రైమరీ మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేస్తారు. రోగి బంధువులకు చికిత్స ఆపివేయడంతో కలిగే పరిణామాలను క్షుణ్ణంగా వివరించి, లిఖితపూర్వక సమ్మతిని తీసుకుంటారు. ఆ తర్వాతే సెకండరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు వస్తే రోగి తరపు వారు హైకోర్టుకు వెళ్లొచ్చు.  
» కారుణ్య మరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల వైద్య రికార్డులను కనీసం మూడేళ్ల పాటు తప్పనిసరిగా భద్రపరచాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement