8న ఘనంగా రైతు దినోత్సవం

Government of Andhra Pradesh Celebrates July 8 As Farmers Day - Sakshi

రాష్ట్ర స్థాయి మొదలు.. ఆర్బీకే స్థాయి వరకు కార్యక్రమాలు

అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్‌    

రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ఇదే రోజు పలు పనులకు శ్రీకారం 

రూ.1,506.95 కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

రూ.413 కోట్లతో నిర్మించిన 1,986 రైతు భరోసా కేంద్రాలు.. 

రూ.79.50 కోట్లతో ఏర్పాటైన 100 వైఎస్సార్‌ ఆక్వా ల్యాబ్‌లు..

రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ ఆస్పత్రుల ప్రారంభం

400.30 కోట్ల వ్యయంతో 1,262 గోదాముల నిర్మాణానికి శంకుస్థాపనలు

రూ.200 కోట్లతో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ వసతుల కల్పన..

రూ.200 కోట్లతో మార్కెట్‌ యార్డుల్లోనూ నాడు–నేడు పనులు

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన రాష్ట్ర స్థాయిలో మొదలు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయి వరకు ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు  చేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆదాయం పెంచడమే లక్ష్యంగా, రైతులకు సకల సౌకర్యాలు ఉన్న ఊరిలోనే కల్పించడమే ధ్యేయంగా రెండేళ్లుగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రైతు దినోత్సవం సందర్భంగా రూ.1,506.95 కోట్ల విలువగల పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రైతులకు వ్యవసాయానికి అవసరమైన విత్తనం నుంచి పంట విక్రయం వరకు చేదోడు వాదోడుగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,300 కోట్లతో 10,408 రైతు భరోసా కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణాలను చేపట్టారు.

ఇప్పటికే రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణాలు పూర్తయిన 1986 డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల భవనాలను సీఎం అనంతపురం జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రారంభిస్తారు. వీటితో పాటు 100 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా, వ్యవసాయ, పశుసంవర్థక ల్యాబ్‌లు, ఇతర ప్రాజెక్టుల ప్రారంభానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఇతరత్రా ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. కాగా, 8వ తేదీ నాటికి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

రెండడుగులు ముందుకే..
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల కోసం ఉన్న ఊరిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల వసతులు, సదుపాయాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రైతుల గురించి గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆలోచించారని, ఇప్పుడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌ ఇంకా సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి రైతుల కోసం గ్రామాల్లోనే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెబుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనం మొదలు.. ఎరువులు, పురుగు మందులు నాణ్యమైనవి రైతు భరోసా కేంద్రాల నుంచే సరఫరా చేస్తున్నారని, దీంతో రైతులు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే పని తప్పిందని వివరిస్తున్నాయి. రైతులు పండించిన పంటలను కూడా కనీస మద్దతు ధరకే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయిస్తున్నారని, రెండేళ్ల పాలనలోనే రైతులకు రైతు భరోసాతో పాటు వివిధ రంగాల ద్వారా 68 వేల కోట్ల రూపాయలకు 
పైగా సాయం అందించారని గుర్తు చేస్తున్నాయి.

ప్రారంభోత్సవాలు వీటికే..
రూ.413.76 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన 1986 వైస్సార్‌ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలు.
రూ.79.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 100 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్‌ ల్యాబ్‌లు.
రూ.96.64 కోట్లతో తొలి విడత నిర్మించిన 645 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు. 
రూ.31.74 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 53 కొత్త వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్‌ లైవ్‌ స్టాక్‌ యూనిట్లు.
పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రూ.7.53 కోట్ల వ్యయంతో టెలీ మెడిసిన్‌ కాల్‌ సెంటర్‌. రైతు భరోసా కేంద్రాల ద్వారా పశు సంవర్థక, ఆక్వా రంగాలకు ఇన్‌పుట్స్‌.
రూ.మూడు కోట్ల వ్యయంతో ఆరు కొత్త రైతు బజార్లు. పశు–మత్స్య దర్శిని మ్యాగ్‌జైన్‌ ఆవిష్కరణ.

వీటికి శంకుస్థాపనలు..
రూ.400.30 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణం.
రూ.200.17 కోట్ల వ్యయంతో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక పోస్ట్‌ హార్వెస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేంద్రం. 
అనకాపల్లిలో బెల్లం, రాజమండ్రిలో అరటి, శ్రీకాకుళంలో జీడిపప్పు, చిత్తూరులో మామిడి, బాపట్లలో చిరుధాన్యాలు, వైఎస్సార్‌ కడపలో అరటి, హిందూపురంలో వేరుశనగ, కర్నూలులో టమాట ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణం.
రూ.212.31 కోట్ల వ్యయంతో మార్కెట్‌ యార్డుల్లో నాడు– నేడు కింద అభివృద్ధి పనులు.
రూ.45 కోట్ల వ్యయంతో కొత్తగా 45 రైతు బజార్ల ఏర్పాటు. 
వైఎస్సార్‌ జిల్లా ఊటుకూరులో రూ.2 కోట్లతో కడక్‌ నాథ్‌ పౌల్ట్రి ఏర్పాటు.
రూ.15 కోట్లతో నాబార్డు ప్రాజెక్టు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top