డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ | Good results with dance movement therapy | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌

May 22 2025 5:10 AM | Updated on May 22 2025 5:10 AM

Good results with dance movement therapy

పార్కిన్స్‌సన్స్‌కు నృత్య చికిత్స

వృద్ధులకు మృదువైన ట్రీట్మెంట్‌

ప్రయోగాత్మకంగా నిర్ధారణ

మానసికంగానూ మెరుగు

డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీతో సత్ఫలితాలు

అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్‌సన్స్‌’ డిసీజ్‌ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! 

దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ విషయమే అంటోంది ‘ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి).

పార్కిన్‌సన్‌లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్‌సన్స్‌ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్‌ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. 

స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్‌సన్స్‌ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్‌సన్స్‌లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే.

తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది
‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్‌. 

పార్కిన్‌సన్స్‌లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్‌ కంట్రోల్‌) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి. 

నృత్యం తెచ్చే మార్పేమిటి?
పార్కిన్‌సన్స్‌ మెదడు క్రియాశీలతను, డోపమైన్‌ కేంద్రమైన ‘బేసల్‌ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్‌లు (పార్కిన్‌సన్స్‌ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. 

నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్‌ ఆడిటరీ స్టిమ్యులేషన్‌ (ఆర్‌.ఎ.ఎస్‌.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్ లు, సెరోటోనిన్‌ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్‌ హార్మోన్‌లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు. 

గర్బా నృత్యంపై తొలి ప్రయోగం 
గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్‌సన్స్‌ రోగులపై ఈ డ్యాన్స్‌ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్‌సన్స్‌కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్‌సన్స్‌ డిసీ జ్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది.

అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్‌కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర  శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి. 

పార్కిన్‌సన్స్‌ లక్షణాలు – కారణాలు
ప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్‌సన్స్‌కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్‌ అవసరం. 

డోపమైన్‌ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్‌ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్‌సన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు. 

రోగులు తమకు తామే వైద్యులు
సాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్‌మెంట్‌ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు.ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు 
మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement