సోడా.. సోడా.. గోలి సోడా..! | Goli Soda Chakravathi, Machilipatnam 50 Years Old Tradition Business Survives Amid Modern Soft Drinks | Sakshi
Sakshi News home page

సోడా.. సోడా.. గోలి సోడా..!

Mar 28 2026 11:05 AM | Updated on Mar 28 2026 11:39 AM

Goli Soda Chakravathi 50 Years Business Machilipatnam

ఇప్పుడంటే ఏడాది పిల్లలు సైతం కూల్‌డ్రింక్‌లు కావాలంటూ మారాం చేస్తున్నారు కాని... ఓ 30, 40 ఏళ్ల కిందట వరకు గోలీసోడాకు ఉన్న క్రేజే వేరు... వీధిలోకి సోడా బండి వచ్చిందంటే జనం ఎగబడే వారు. గోలి సోడా కొట్టేటప్పుడు వచ్చే ఆ శబ్దానికి కూడా ఫ్యాన్స్‌ ఉండేవారు. సోడాలో గ్యాస్‌ పట్టే దానిని బట్టి ఆ సోడా బండికి కూడా డిమాండ్‌ ఉండేది. నైన్‌టీస్‌ వరకు ఓ వెలుగు వెలిగిన గోలి సోడా క్రమేణా కనుమరుగవుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా సోడా బండి కనపడితే ఈ తరం పిల్లలు విచిత్రంగా చూసే పరిస్థితి.

50 ఏళ్లకు పైగా సోడా వ్యాపారం చేస్తున్న చక్రవర్తి
మచిలీపట్నంటౌన్‌:   గోలి సోడా కనుమరుగైన నేటి రోజుల్లో కూడా ఇప్పటికీ సోడా విక్రయం ద్వారా జీవనం సాగిస్తున్నాడు ఈ వృద్ధుడు. నైన్‌టీస్‌లో ప్రధాన డ్రింకుగా సోడానే ఉండేది.. కాలానుగుణంగా పలు రకాల కార్పొరేట్‌ సంస్థల కూల్‌డ్రింకులు అందుబాటులోకి రావడంతో సోడా కనుమరుగవుతూ వచ్చింది. కానీ నగరంలోని కాలేఖాన్‌పేట మంచినీటి కాలువ ప్రాంతానికి చెందిన చక్రవర్తి అనే వృద్ధుడు నేటికీ ఈ వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. దాదాపు 50 ఏళ్లకు పైబడి ఈ వ్యాపారం చేస్తున్నాడు. నాటి చెక్క బండిలోనే సోడాలను ఉంచి నగరంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ గోలి సోడాలను  విక్రయిస్తున్నాడు.

 సోడా కావలసిన వారికి ఓపెనర్‌కి సోడా మూతికి  మధ్య రబ్బర్‌ ముక్కను అడ్డుపెట్టి పెద్ద శబ్దం చేస్తూ ఓపెన్‌ చేస్తుండడం చూపర్లను పాతకాల జ్ఞాపకాల్లోకి తీసుకువెళుతోంది. రూ.5 పైసల నుంచి సోడాను విక్రయిస్తున్న చక్రవర్తి ప్రస్తుతం మామూలు సోడాను రూ.10కు, నిమ్మకాయ సోడాను రూ.15కు, సుగంధి సోడాను రూ.20 చొప్పున విక్రయిస్తున్నాడు. కాలగమనంలో కలుస్తున్న ఈ అరుదైన గోలి సోడాను విక్రయిస్తూ బతుకుతూ సోడాను కూడా ఇంకా బతికిస్తున్న చక్రవర్తి ఈ ప్రాంతంలో గోలి సోడా చక్రవర్తిగా పాపులర్‌.  

Advertisement
 
Advertisement
Advertisement