
నెలాఖరు నుంచి బంగారం ఉత్పత్తి!
జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లిలో బంగారం నిక్షేపాలు
అనుమతులు పొందిన జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
ఏటా 500 కిలోల నుంచి 1,000 కిలోల వరకు వెలికితీతకు సిద్ధం
రూ.500 కోట్లతో బంగారం గని తవ్వకాలు
తుగ్గలి (కర్నూలు జిల్లా): కరువు నేలల్లో పసిడి పంట పండనుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో తొలిసారి ప్రైవేటు గోల్డ్ మైనింగ్ కంపెనీ బంగారం నిక్షేపాల వెలికితీతకు సిద్ధమైంది. నాలుగు దశాబ్దాల పాటు చేసిన సర్వేలు, పరిశోధనలు ఫలించడంతో ఈ నెలాఖరున పట్టాలెక్కనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లి, జీ.ఎర్రగుడి పరిసర ప్రాంతాల్లో 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు సర్వేల్లో గుర్తించారు.
ఆ నిక్షేపాలను వెలికితీసేందుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. కంపెనీలో 70 శాతం వాటాతో త్రివేణి ఎర్త్‌మూవర్స్, ప్రాకార్, లాయిడ్స్ మెటల్స్ ప్రధాన వాటాదారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ 27.27 శాతం వాటా కలిగి ఉంది. ప్రధాన వాటాదారు మైనింగ్ దిగ్గజం బి. ప్రభాకరన్ ఈ ప్రాజెక్టు బాధ్యతలు పర్యవేక్షించనున్నారు.
40 ఏళ్లకు పైగా సర్వేలు, పరిశోధనలు
ఈ ప్రాంతంలో 40 ఏళ్లకు పైగా పలు సంస్థలు సర్వేలు, పరిశోధనలు చేశాయి. మొదట జీఎస్‌ఐ, ఎమ్మీసీఎల్ సంస్థలు సర్వే చేశాయి. ఆ తర్వాత 1994 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సర్వే చేపట్టింది. బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న సంస్థ ప్రభుత్వ అనుమతులు కోరడంతో 2013లో అనుమతులు వచ్చాయి.
పలు పరిశోధనల అనంతరం సంస్థ నిర్ధారించుకున్న తర్వాత 2023 సెపె్టంబరు 2న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు భూమి పూజచేశారు. మొదట చిన్నప్లాంట్ ఏర్పాటుచేసి అందులో ప్రాసెసింగ్ ట్రయల్ నిర్వహిస్తూనే మరో రూ.200 కోట్లతో పెద్ద ప్లాంట్ నిర్మాణం పూర్తిచేశారు.
బంగారం ఉత్పత్తికి సిద్ధం
దాదాపు రూ.500 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్టోబరు నెలాఖరు నుంచి గానీ, నవంబరు ప్రారంభం నుంచి కానీ బంగారం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైనట్లు ప్రధాన వాటాదారు బి. ప్రభాకరన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రారంభంలో ఏడాదికి 500 కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. అన్ని చట్టబద్ధమైన అనుమతులతో క్రమంగా ఏడాదికి సుమారు 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేందుకు కంపెనీ సమాయత్తమవుతోంది. అలాగే, ప్రభుత్వ అనుమతులతో ఇక్కడే 24 క్యారెట్ల బంగారం ప్రాసెసింగ్ చేయనున్నారు.
597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు
నిజానికి.. ఈ ప్రాంతంలో 597.82 హెక్టార్లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ దాదాపు 30 ఏళ్ల క్రితం ఎకరా రూ.4,500 చొప్పున రైతుల నుంచి లీజుకు తీసుకుని సర్వేలు, పరిశోధనలు, డ్రిల్లింగ్ చేపట్టింది. ఆ తర్వాత లీజు మొత్తం పెంచుతూ వచ్చింది.
బంగారం వెలికితీతకు ఎకరా రూ.12 లక్షల చొప్పున రైతుల నుంచి ఇప్పటివరకు 283 ఎకరాలు కొనుగోలు చేసింది. మిగిలిన భూములకు ఎకరాకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున చెల్లిస్తోంది. కంపెనీలో ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. మున్ముందు మరింత మందికి ఉపాధి కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు..
మరోవైపు.. జియో మైసూర్ కంపెనీ బంగారం నిక్షేపాలు వెలికితీస్తూనే సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జొన్నగిరి, పగిడిరాయిలో పాఠశాలలకు మినరల్ వాటర్ సరఫరా చేస్తోంది. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలకు కృషిచేస్తోంది.
చెన్నంపల్లి, పీ.కొత్తూరు, బొల్లవానిపల్లి విద్యార్థులు ఉన్నత చదువుకు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిoచింది. ఉత్పత్తి బాగా జరిగితే విద్య, వైద్యంతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్లాంట్ ప్రతినిధులు వివరించారు.