తండ్రికి ‘తల్లై’ పునర్జన్మనిచ్చింది..

Girl Donate Part Of Her Liver To Her Father In Visakhapatnam - Sakshi

లివింగ్‌ డోనర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌

విజయవంతం చేసిన కేర్‌ ఆస్పత్రి వైద్యులు

 సకాలంలో ఆదుకున్న సీఎం రిలీఫ్‌ ఫండ్‌

డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): కంటే కూతుర్నే కనాలి అంటారు..నిజమే ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. కాలేయవ్యాధితో మృత్యువుకు దగ్గరవుతున్న తండ్రిని కాపాడుకునేందుకు ఏకంగా తన కాలేయంలో సగ భాగమిచ్చి రుణం తీర్చుకుంది ఓ కుమార్తె. సీఎం రిలీఫ్‌ ఫండ్, కేర్‌ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన నీలకంఠేశ్వరరావు రెండేళ్లుగా లివర్‌ సమస్యతో బాధపడతున్నాడు. చివరి దశ కాలేయ వ్యాధితో మృత్యువుకు దగ్గరలో ఉన్న తరుణంలో తన కుమార్తె వాణి ముందుకు వచ్చింది.

తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రి నీలకంఠేశ్వరరావుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వైజాగ్‌లోని కేర్‌ హాస్పటల్స్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ నయూ మ్‌ నేతృత్వంలో కేర్‌ హాస్పటల్స్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కింజరాపు రవిశంకర్, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అనస్థిషియా డాక్టర్‌ రాజ్‌కుమార్, వైద్య బృందం శస్త్రచికిత్సకు పూనుకున్నారు. అక్టోబర్‌ 2వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభించిన శస్త్రచికిత్స దాదాపు 16 గంటల పాటు సాగింది. ఆపరేషన్‌ విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ నయూమ్‌ మాట్లాడుతూ కాలేయ వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడడానికి లివింగ్‌ డోనర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానం సరికొత్త పరిష్కారాన్ని చూపుతుందని, సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్ల కాలేయవ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమై నీలకంఠేశ్వరరావు సాధారణ స్థితికి చేరుకున్నారని, అలాగే లివర్‌ ఇచ్చిన వాణి కూడా పూర్తిగా కోలుకుందని, ఆరు వారాల్లో ఆమె కాలేయం యథాస్థితికి చేరుకుందని డాక్టర్‌ నయూమ్‌ చెప్పారు.

నీలకంఠేశ్వరరావు పోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌తో డీకంపెన్సేటెడ్‌ సిర్రోసిస్‌ ఆఫ్‌ లివర్‌ కూడా క్షీణించి హెపటోరెనల్‌ సిండ్రోమ్‌ అనే పరిస్థితికి దారి తీసిందని, అతనికి వీలైనంత త్వరగా లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి వచ్చిందని, అందుకు అతని కుమార్తె వాణి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మీడియా సమావేశంలో లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కింజరాపు రవిశంకర్‌ పాల్గొన్నారు. 

సైన్స్‌పై పట్టు ఉండడం వల్లే.. 
తాను బైపీపీ విద్యార్థిని కావడంతో కొంత అవగాహన ఉండడంతో కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చానని, నా కాలేయంలో సగ భాగం తీసి తండ్రి నీలకంఠేశ్వరరావుకు అమర్చారని, ప్రస్తుతం ఇద్దరం బాగానే ఉన్నామని మీడియాకు వాణి వివరించారు. ఆపరేషన్‌ విజయవంతం చేసిన వైద్యులు..ముఖ్యంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top