
ఆ హక్కుకు ఎవరూ విఘాతం కలిగించలేరు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ
సోషల్ మీడియా అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదు
అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుంది
ఆ చట్టానికి సవరణ చేస్తే దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు.. దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి : ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ (భావ ప్రకటనా స్వేచ్ఛ) అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరూ విఘాతం కల్పించలేరని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
గతంలో ఆ చట్టం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000)లోని సెక్షన్–66–ఏ కు కేంద్రం ఒక సవరణ చేస్తే.. దాన్ని సుప్రీంకోర్టులో శ్రేయ సింఘాల్ సవాల్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఆ సవరణ వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ లోని భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు అని స్పష్టం చేసిందని వివరించారు. అసెంబ్లీలో తగినంత సమయం ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం. అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించకూడదు.. ప్రజల గొంతు వినిపించకూడదు అనేదే ఆయన ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదు’ అంటూ గుర్తు చేశారు.
కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగాలి
స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు ఈవీఎంలు పరిష్కారం కాదని.. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా రిగ్గింగ్ చేయించిందని ఎత్తి చూపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు నిర్వహిస్తేనే పారదర్శకంగా జరుగుతాయని పునరుద్ఘాటించారు. ‘యూరియా కొరత వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం.
అసలు ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా? ఖరీఫ్‌లో పంట చేలకు ఎన్నిసార్లు, ఎంత యూరియా వేస్తారో తెలియదు.. కనీసం దాన్నయిన అచ్చెన్నాయుడును తెలుసుకోమనండి’ అంటూ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘తురకపాలెంలో వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టంగా చెప్పడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే అర్థం లేని విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారు. అందుకే అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా తేలితే నేను వెళ్తాను’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు.