ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌.. వారికి మాత్రమే ఛాన్స్..!

Free Aadhar Update Camps Across AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆధార్‌ అప్‌డేట్‌ సేవలను ఉచి­తంగా అందిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయి­తే, ఆన్‌లైన్‌లో సొంతగా ఆధార్‌ వివరాలను అప్‌­­డేట్‌ చేసుకునేవారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్ర­ప్రదేశ్‌లో కొత్త జిల్లాల పేర్లతో ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందుకోసం యూఐడీఏఐ ప్రమా­ణాలకు అనుగుణంగా ధ్రువీకరణపత్రాల జారీకి ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు ఆధార్‌ కార్డుల జారీ సంస్థ అయిన యూ­ఐ­­డీఏఐ హైదరాబాద్‌ ప్రాం­­తీయ కార్యాల­యం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ పి.సంగీత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.జవహర్‌రెడ్డికి లేఖ రాశారు.

ప్రతి ఒక్కరూ పదేళ్లకు ఒకసారి అయినా ఆధార్‌ కార్డులోని తమ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని యూఐడీఏఐ ఇటీవల నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని­ప్రకారం ఆన్‌లైన్‌లో సొంతగా ఆధార్‌ వివరాల­ను అప్‌డేట్‌ చేసుకునేవారికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఆధార్‌ సెంటర్లకు వెళ్లి అప్‌డేట్‌ చేసుకునేవారు మాత్రం యథావిధిగా నిర్ణీత ఫీజు చెల్లించాలి. మరోవైపు ఈ నెల 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు మాత్రమే ఉచిత సేవలు లభిస్తాయని యూఐడీఏఐ వేరుగా డిజిటల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది.

అప్‌డేట్‌ చేసుకోవాల్సినవారు 1.56 కోట్ల మంది! 
ఆధార్‌ కార్డు తీసుకుని పదేళ్లు అయినా ఇప్పటికీ ఒక్కసారి కూడా తమ చిరునామా, ఫొటో ధ్రువీకరణ వంటి వివరాలు అప్‌డేట్‌ చేసుకోనివారు రాష్ట్రంలో 1.56కోట్ల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో 2022, డిసెంబరు 31 నాటికి 5,19,98,236 మందికి ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయి. వారిలో 1.56కోట్ల మంది కొత్త నిబంధన ప్రకారం తమ ఆధార్‌లో వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

నేటి నుంచి ప్రత్యేక ఆధార్‌ క్యాంపులు
ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. ఆధార్‌ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 20, 21, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ సాగిలి షన్‌మోహన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, సచివాలయాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

గ్రామ, వార్డు సచివాలయాలు లేదా స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంపులు నిర్వహిం­చాలని సూచించారు. ఆధార్‌ క్యాంపుల సమా­చారాన్ని ఆయా ప్రాంత ప్రజలందరికీ తెలి­సేలా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిష­నర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్యాంపులు ఏర్పాటుచేసిన ప్రాంతా­ల్లోని వలంటీర్లు తమ పరిధిలో 2014కు ముందు ఆధార్‌ కార్డులు పొంది ఇప్పటివరకు అప్‌డేట్‌ చేసుకోనివారిని గుర్తించి వారికి ప్రత్యేక ఆధార్‌ క్యాంపుల గురించి తెలియజేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: ‘స్కిల్‌’ సూత్రధారి బాబే 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top