ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత

four died in Nandyal District - Sakshi

మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్‌ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్‌ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. 

ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్‌ కుమారులు సమీర్‌(18), రియాన్‌(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్‌(17), నవసీన్‌ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్‌ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్‌ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్‌ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top