పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్‌ జగన్‌ ఆరా | Former Minister Nallapareddy Prasannakumar Reddy house attacked in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు: పచ్చమూకల విధ్వంసకాండపై వైఎస్‌ జగన్‌ ఆరా

Jul 8 2025 4:13 AM | Updated on Jul 8 2025 6:30 AM

Former Minister Nallapareddy Prasannakumar Reddy house attacked in Nellore

మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి

70–80 మంది దుండగులు మారణాయుధాలతో ఇంట్లోకి ప్రవేశం

సీసీ కెమెరాలు, రెండు కార్లు ధ్వంసంచేసి బీభత్సం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి, అమరావతి : నెల్లూరు జిల్లాలో టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయి. రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి దాడిచేసి బీభత్సం సృష్టించారు. 70–80 మంది సోమవారం రాత్రి 9 గంటల సమ­యంలో మారణాయుధాలతో నెల్లూరు నగరం సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. వారిని ఎవరూ గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను ముందుగా ధ్వంసంచేశారు. ఇంటి ముందు నుంచి కొందరు.. వెనుక వైపు కిచెన్‌ తలు­పులను పగులగొట్టి మరికొందరు లోపలికి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. 

కింద గదితోపాటు పైభా­గంలోని గదిలో వస్తువులన్నింటినీ పగులగొట్టారు. అడ్డుకోబోయిన సిబ్బందిపైనా పచ్చమూకలు దాడిచేశాయి. పోర్టికోలో ఉన్న రెండు కార్లను ధ్వంసం చేశారు.  అరగంట పాటు నానా బీభత్సం సృష్టిం­చారు.  కంటి ఆపరేషన్‌ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ టీæడీపీ మూకల దాడితో భీతిల్లిపోయి కుప్పకూలిపోయారు. తమతో పెట్టుకుంటే అంతుచూస్తామని, ఎవరిని వదిలిపెట్ట­బోమని దుండగులు హెచ్చరించారు. 

అయితే, పోలీసులు వస్తున్నా­రని తెలుసుకుని దుండగులు బైక్‌లపై పరార­య్యారు. దాడి సమాచారం అందుకున్న నెల్లూరు నగర డీఎస్పీ పి. సింధుప్రియ హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. మంత్రి లోక్‌శ్‌ నెల్లూరులో ఉండగానే ఈ ఘటన జరగడం చూస్తే.. దీని వెనుక పెద్దస్థాయిలో కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రసన్నకు వైఎస్‌ జగన్‌ ఫోన్‌..
పచ్చమూకల దాడి సమాచారం తెలిసిన వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫోన్లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీసి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  

ప్రసన్నను హత్య చేసేందుకేనా?
దుండగులు పథకం ప్రకారం నల్లపరెడ్డి ప్రసన్నకు­మా­ర్‌రెడ్డిని హత్యచేసేందుకే ఈ దుశ్చర్యకు ఒడిగ­ట్టినట్లు తెలుస్తోంది. రాత్రయితే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో ఉంటారని భావించిన దుండగులు మారణా­యుధాలతో ఇంటికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేకపోవడంతో ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కోవూరు సమావేశం అనంతరం ప్రసన్న­కుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు, స్థానిక నేతలతో కలిసి కోవూరులోనే ఉన్నారు. ఇంట్లో ఉండి ఉంటే ఆయన పరిస్థితి దారుణంగా ఉండేదని అంటున్నారు. 

విమర్శలు జీర్ణించుకోలేకే దాడి..
జిల్లాలో నల్లపరెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తే.. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజకీయంగా చేస్తున్న పోరాటంలో భాగంగా సోమవారం నియోజకవర్గ కేంద్రం కోవూరులో ‘రీకాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెండ్రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆమె వ్యాఖ్యలను ప్రసన్నకుమార్‌రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. దీనిని టీడీపీ మూకలు జీర్ణించుకోలేక ఈ దాడికి బరితెగించినట్లు తెలుస్తోంది.

ప్రశాంతిరెడ్డి అనుచరుల పనే?
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రశాంతిరెడ్డి అవినీతిని ప్రసన్నకుమార్‌రెడ్డి నిలదీస్తూ వచ్చారు. ఇది టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే టీడీపీ మూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

జిల్లా చరిత్రలో ఇదే ప్రథమం..
నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి ఘటనలు చోటుచే­సుకోవడం ఇదే ప్రప్రథమం. రాజకీయ చైత­న్యం కలి­గిన జిల్లాలో నేతలు ఎంతో హుందాగా రాజ­కీయాలు చేస్తుండేవారు. కేవలం ఆరోపణలు, ప్రత్యా­రోపణలకు మాత్రమే పరిమితమయ్యేవారు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అణిచివేత ధోరణులకు బరితెగిస్తున్నారు.  

వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు పెట్టాలి
వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్‌
ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించిన నెల్లూరు జిల్లా నేతలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి ఘటనకు సంబంధించి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితోపాటు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోలీసులను డిమాండ్‌ చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం తెలుసుకున్న అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజిత పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు పొదలకూరు రోడ్డులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులకు బరి తెగిస్తూ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి ప్రోత్సాహంతోనే ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. డబ్బు ఉందన్న అహంకారంతో వేమిరెడ్డి దంపతులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ధీటుగా సమాధానం చెబుతామన్నారు. 

ఈ దాడికి బాధ్యత వహిస్తూ వేమిరెడ్డి దంపతులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లిపై సైతం దౌర్జన్యం చేశారన్నారు. నెల్లూరు జిల్లాలో బిహార్‌ సంస్కృతిని తీసుకు వస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement