హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్‌! | Five support ship for indian navy: Andhra pradesh | Sakshi
Sakshi News home page

హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్‌!

May 11 2026 2:43 AM | Updated on May 11 2026 2:43 AM

Five support ship for indian navy: Andhra pradesh

ఐదు భారీ సహాయక నౌకల నిర్మాణం వేగవంతం

యుద్ధ నౌకలకు కొండంత అండ

నిరంతరం సరఫరాలు సులభతరం 

సకాలంలో ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర రేషన్‌ సరఫరా 

సొంత రక్షణ వ్యవస్థనూ కలిగి ఉన్న సహాయక నౌకలు 

అత్యవసర సమయాల్లో మానవ సహాయక చర్యలకూ వెసులుబాటు 

పూర్తిగా స్వదేశీ డిజైన్, పరికరాలతో శరవేగంగా ప్రాజెక్టు పనులు

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర సామగ్రి, రేషన్‌ను ఎప్పటికప్పుడు అందించే అత్యాధునిక ఐదు భారీ ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌) నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తిగా స్వదేశీ డిజైన్, పరికరాలతో రూ.19,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తాజాగా హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)లో ఐదవ, చివరి  ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌ స్టీల్‌ కటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ ఐదవ నౌక నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ఇండియన్‌ నేవీ యుద్ధనౌకల నిర్మాణ, నియంత్రణాధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌సాధు, షిప్‌యార్డు సీఎండీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త శిఖరాలను అధిరోహించడమే కాకుండా, విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ నౌకలను నిర్మించుకునే సత్తాను చాటిచెబుతోంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి.  

కొన్ని ముఖ్యాంశాలు..
 కొచ్చికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్‌ సంస్థ స్మార్ట్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ డిజైన్‌ సొల్యూషన్స్‌ (ఎస్‌ఈడీఎస్‌) రూపకల్పనతో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో హిందుస్థాన్‌ షిప్‌యార్డు, ఎల్‌అండ్‌టీ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.

ప్రాజెక్టులో రెండు నౌకలు కట్టుపల్లిలో, మిగిలిన మూడు విశాఖపట్నంలో నిర్మీతమవుతున్నాయి.  

కేవలం యుద్ధ అవసరాలకే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి, విదేశాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి  ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.  

తమను తాము రక్షించుకోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణి వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు, సమీప శ్రేణి రక్షణ వ్యవస్థలను సైతం ఈ నౌకలు కలిగి ఉంటాయి. వీటిలో అమర్చిన ఇంజన్లు, విద్యుత్‌ ఉత్పత్తి పరికరాలు అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తాయి.

ప్రతి ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ఒక ధ్రువ్‌ హెలికాప్టర్‌ నిలిపేందుకు హ్యాంగర్‌ సదుపాయం ఉంది.  

 మొదటి నౌకను  2027 జూన్‌లో అప్పగించాలని భావిస్తుండగా, ఆ తర్వాత ప్రతి 10 నుంచి 12 నెలలకోసారి ఒక్కో ఎఫ్‌ఎస్‌ఎస్‌ చొప్పున మూడేళ్లలో 5 ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్స్‌ని జలప్రవేశం చేసేలా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement