21,452 మందికి మొండిచేయి | Fishermans Fires on Chandrababu Govt: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

21,452 మందికి మొండిచేయి

May 26 2026 5:29 AM | Updated on May 26 2026 5:29 AM

Fishermans Fires on Chandrababu Govt: Andhra Pradesh

మత్స్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన అన్యాయమైపోయిన లబ్ధిదారులు

వేట నిషేధ భృతికి చంద్రబాబు సర్కార్‌ ఎగనామం

మాటల గారడీ..మత్స్యకారులకు బురిడీ

జమకాని సొమ్ము రూ.42.90 కోట్లు పైమాటే 

వెయ్యి లీటర్ల సబ్సిడీ డీజిల్‌ వాడుకోలేదని కొర్రీలు  

మండిపడుతున్న మత్స్యకారులు

‘లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌’ తరహాలో మత్స్యకార సాయం పంపిణీలో సీఎం చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మంటలేని స్టవ్‌పై గరిట తిప్పి చేపల కూర వండేసిన చంద్రబాబు.. దానిని మత్స్యకార మహిళలకు వడ్డించారు. తాను కూడా నేలపై కూర్చుని వారితోపాటే భోజనం చేశారు. దీనికి పచ్చమీడియా విస్తృత ప్రచారం కల్పించింది. చివరకు అదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమేనని తేలిపోయింది. ఇదే విషయాన్ని మత్స్యకారులు కూడా చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో అయితే దీనిపై మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. నిజంగా అంతటి అభిమానం, ప్రేమ చంద్రబాబుకు తమపై ఉంటే ఈ రోజు ఇన్ని వేల మందికి వేట నిషేధ భృతికి ఎగనామం పెట్టి రోడ్డున పడేసేవారు కాదని మత్స్యకారులు వాపోతున్నారు.  

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మత్స్యకార సేవలో..’ పథకం వెన్నుపోటు తోవలో నడిచింది. మాటల గారడీతో సీఎం చంద్రబాబు మత్స్యకారులను బురిడీ కొట్టించారు. సముద్రంపై చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార సాయంలో అడ్డగోలుగా కోతలు విధించిన చంద్రబాబు సర్కారు గంగపుత్రులకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో 21,452 మంది మత్స్యకారులకు కొర్రీల మీద కొర్రీలు వేసి దాదాపు రూ.42.90 కోట్లకు పైగా ఎగ్గొట్టారు. దీనిపై మత్స్యకారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 

డబుల్‌ చేస్తానని డబ్బాకొట్టి.. 
ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజులపాటు సముద్రంపై వేట నిషేధ సమయంలో జీవనాధారం కోల్పోయే మత్స్యకారులకు ప్రభుత్వం వేట నిషేధ భృతి అందిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచి డబుల్‌ చేస్తామని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టగా.. రెండో ఏడాది అరకొర సాయానికే పరిమితమైంది.

ఈ ఏడాది ఆదినుంచీ వేట నిషేధ భృతికి అర్హుల సంఖ్యను కుదిస్తూ కోతలు పెట్టడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 19న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో చంద్రబాబు ఆర్భాటంగా చేశారు. 1,30,796 కుటుంబాల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్టు చంద్రబాబు ఆ కార్యక్రమంలో ఘనంగా ప్రకటించారు.  

క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నం 
తీరాచూస్తే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 18న మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట నిషేధ లబ్ధి కోసం రిజి్రస్టేషన్‌ ఉన్న బోట్లపై ప్రభుత్వం లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వే చేపట్టింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, తిరుపతి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే అనంతరం 1,52,248 మంది లబ్ధిదారులను గుర్తించింది.

వీరిలో విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయని, పింఛను, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్నారనే సాకులతో 9,045 మందిని జాబితా నుంచి తొలగించింది. మరో 12,407 మంది మెకనైజ్డ్‌ బోట్ల(సముద్రంలో లోతైన జలాల్లోకి వేటకు వెళ్లే పెద్ద బోట్లు, ట్రాలర్‌లు) లబ్ధిదారులకు కూడా ఎగనామం పెట్టింది. ఇలా మొత్తంగా 21,452 మంది మత్స్యకారులను అనర్హులుగా తేల్చింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 4,883 మందికి వేట నిషేధ భృతిని ఎగ్గొట్టేసింది. రెండో స్థానంలో కాకినాడ జిల్లాలో 2,692 మందికి కొర్రీలతో కోతపెట్టి రోడ్డున పడేసింది. ఇందుకు చూపించిన కారణం కూడా చాలా అన్యాయంగా ఉందని మత్స్యకార సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

తక్కువ డీజిల్‌ వినియోగించారని.. 
మెకనైజ్డ్‌ బోట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం డీజిల్‌ రాయితీ లీటరుకు రూ.9 వంతున ఇస్తోంది. సముద్ర వేటకు వెళ్లే మెకనైజ్డ్‌ బోట్ల రాయితీ డీజిల్‌ వెయ్యి లీటర్ల కంటే తక్కువ వినియోగించారనే (సముద్ర వేటకు వెళ్లలేదని నిర్ధారణకు వచి్చ) సాకుతో వారి పేర్లను జాబితా నుంచి తొలగించింది. పోనీ వేట నిషేధ భృతి పొందేందుకు రాయితీ డీజిల్‌ వినియోగించాలనే విషయాన్ని ఎక్కడైనా చెప్పిందా అంటే అదీ లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆర్థిక సాయం ఎగనామం పెట్టేందుకే ఈ నిబంధనను అర్ధాంతరంగా అమలు చేశారని ని­ప్పులు చెరుగుతున్నారు.

సముద్ర వేట కోసం ఒక్కో బోటుపై 8 నుంచి 10 మంది సముద్రంపై వేటకు వెళుతుంటారు. అటువంటిది ఒక్క కాకినాడ జిల్లాలో 385 మెకనైజ్డ్‌ బోట్లు ఉంటే 27,070 మందిని అర్హులుగా గుర్తించి జాబితా కూడా తయారు చేశారు. తీరాచూస్తే.. సవాలక్ష కొర్రీలతో ఈ ఒక్క జిల్లాలోనే 2,692 మంది పొట్టగొట్టి నిషేధ భృతికి ఎగనామం పెట్టారు.

వీరిలో అత్యధికంగా అన్యాయమై పోయింది కాకినాడ నగరం జగన్నాథపురం, ఏటిమొగ, దుమ్ములపేట తదితర ప్రాంతాల్లో 2,500 మంది కావడం గమనార్హం. వీరంతా కాకినాడ మత్స్యకార అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. 61 రోజుల పాటు ఉపాధి లేక అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తే ఇప్పుడు ఇలా కొర్రీల మీద కొర్రీ­లు వేసి సాయం ఇవ్వకుండా మొండిచేయి చూపించడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇన్‌చార్జి జేడీ ఎల్‌బీఎస్‌ వర్ధన్‌ వద్ద ప్రస్తావిస్తే మెకనైజ్డ్‌ బోట్లపై వేటకు వెళ్లే మత్స్యకారులకు సాయం జమకాని విషయాన్ని శాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళతామన్నారు.  

3 మీటర్లు ఉన్నాయని ఇవ్వలేదు 
మాది కాకినాడ సమీపంలోని దుమ్ములపేట. ప్రభుత్వం మత్స్యకారుల సేవలో అని వేట నిషేధ భృతిని విడుదల చేసింది. నా పేరు లిస్టులో ఉన్నప్పటికీ నాకు మత్స్యకార భరోసా పడలేదు. ఇదేమని అడిగితే నా పేరిట మూడు కరెంటు మీటర్లు ఉన్నాయని తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ.. నాకు ఒక్క విద్యుత్‌ మీటర్‌ కూడా లేదు. వేట నిషేధ భృతి ఇచ్చి ఆదుకోవాలి.     – పేర్ల సత్తిబాబు, దుమ్ములపేట, కాకినాడ

70 శాతం మందికి డబ్బులు పడలేదు 
మా మావయ్యకు బోటు ఉంది. దానిపైనే వేటకు వెళ్తుంటాం. గత ప్రభుత్వ హయాంలో ఏటా మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు జమైంది. బాబు అధికారంలోకి వచ్చిన త­ర్వాత తొలి ఏడాది పైసా జమ కాలేదు. గతే­డాది కూడా కొంతమందికి జమ కాలేదు. ఈ ఏడాదైతే ఏకంగా 70 శాతం మందికి డబ్బులు పడలేదు. నాకు కూడా పడలేదు.  నిషేధ భృతి డబ్బులు జమ కాకపోతే ఎలా బతికేది?     – వాసుపల్లి అప్పన్న, అన్నవరం, భీమిలి మండలం, విశాఖ జిల్లా

వేటకు వెళ్లినా భృతి ఇవ్వలేదు 
బోటు నంబర్‌ 546పై చేపల వేటకు వెళ్లాం. అర్హుల జాబితాలో నా పేరు కూడా ఉంది. ఈ నెల 19న వేట నిషేధ భృతి జమ చేస్తున్నామంటే ఆనందపడ్డాం. కానీ వారం రోజులైనా ఇప్పటివరకు మా ఖాతాలకు డబ్బులు పడలేదు. గతేడాది కూడా చాలా మందికి డబ్బులు పడలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు వేట నిషేధ భృతి ఇవ్వాలి.     – బడే ఎల్లాజి, కొండరాజుపాలెం, విజయనగరం జిల్లా 

Advertisement
 
Advertisement
Advertisement