స్టార్టప్స్‌కు ఆర్థిక సాయం అందిస్తాం

Financial Support For Startups Says DRDO Chairman Sathish Reddy - Sakshi

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు)/గోపాలపట్నం (విశాఖ పశి్చమ): రక్షణ రంగానికి ఎదురవుతోన్న అనేక సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు చూపే స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలకు ఆర్థిక సహకారం అందిస్తామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) చైర్మన్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యకు రూ.కోటి వరకు అందించే వెసులుబాటు తమకు ఉందన్నారు. ఈ దిశగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నెలకొల్పుతున్న ఇంక్యుబేషన్‌ కేంద్రం దృష్టిసారించాలని సూచించారు. శుక్రవారం సతీష్‌రెడ్డి ఏయూని సందర్శించి ఆచార్యులతో సమావేశమయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. తర్వాత ఆచార్యులతో మాట్లాడుతూ.. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించి ఏయూతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏయూలో ఏర్పాటవుతున్న ఫుడ్‌ టెస్టింగ్‌ లేబరేటరీ.. మైసూరులోని డీఆర్‌డీవో ఫుడ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీతో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ఆహా్వనించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో సైతం పరిశోధన భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

బెంగళూరు, ఢిల్లీల్లో ఉన్న తమ ప్రయోగశాలల్లో కలసి పనిచేస్తూ తగిన పరిష్కారాలు చూపాలన్నారు. డిఫెన్స్‌ టెక్నాలజీపై ఏఐసీటీఈ సహకారంతో పలు ఎంటెక్‌ కోర్సులను నిర్వహిస్తున్నామని.. వీటిని ఏయూలోనూ ప్రవేశపెట్టాలని కోరారు. డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులకు తమ ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి.. వర్సిటీ ఆచార్యులు చేస్తోన్న రక్షణ రంగ పరిశోధన ప్రాజెక్టుల వివరాలు, వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సతీష్‌రెడ్డిని వర్సిటీ తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరిప్రసాద్, డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కామత్‌ తదితరులు పాల్గొన్నారు.  

స్వయం ప్రతిపత్తిని సాధించాలి..  
కాగా, స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు నేవల్‌ సైన్స్‌ టెక్నాలజీ లే»ొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌) కృషి చేయాలని, దిగుమతులు తగ్గించుకునేలా వృద్ధి చెందాలని సతీష్‌రెడ్డి సూచించారు. విశాఖ మానసి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన ఎన్‌ఎస్‌టీఎల్‌ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్‌ రూపొందించిన హైపవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీని పుణేకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) సంస్థకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను సతీష్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top