ఇక ఎప్పటికప్పుడు ఫీజులు

Fee Reimbursement ‌Deposit money in student mother bank account - Sakshi

విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో రీయింబర్స్‌మెంట్‌ డబ్బు జమ 

రూ.1,880 కోట్లు బకాయి పెట్టిన టీడీపీ ప్రభుత్వం

వీటితో సహా మొత్తం బకాయిలు చెల్లించేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేదనే మాటే ఇక నుంచి విన్పించదు. విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులను ఆయా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం జమ చేస్తుంది. తల్లిదండ్రులు కళాశాలలకు తమ పిల్లల ఫీజులు చెల్లిస్తారు. ఈ ఏడాది నుంచి ఈ పథకానికి కొత్త రూపు తీసుకొచ్చిన ప్రభుత్వం.. పథకం పేరును ‘జగనన్న విద్యా దీవెన’గా మార్చిన విషయం తెలిసిందే. సుమారు 16 లక్షల మంది పోస్టు మెట్రిక్‌ కోర్సుల్లో చదువుతున్న పేద (కులాలతో సంబంధం లేకుండా) విద్యార్థుల కోసం ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
   
బకాయిలు లేకుండా..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలు మొత్తం ఆయా కాలేజీలకు ప్రభుత్వం చెల్లించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆయా కాలేజీలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.1,880 కోట్లు బకాయి పెట్టింది. ఏ ఒక్క సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌ చేయలేదు. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 17 నెలల కాలంలో విడతల వారీగా టీడీపీ ప్రభుత్వ బకాయిలన్నీ కాలేజీలకు విడుదల చేసింది. అలాగే వివిధ శాఖలు, కార్పొరేషన్ల ద్వారా తాజాగా గత నెలలో విడుదల చేసిన రూ.273.16 కోట్లతో కలిపి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పూర్తి స్థాయిలో కళాశాలలకు విడుదల చేసింది. దీంతో విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి బకాయి లేకుండా పోయింది. 

రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు 
జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ (జ్ఞానభూమి) ఓపెన్‌ చేశాం. కొత్తగా కోర్సుల్లో చేరేవారు ఆయా కాలేజీల ద్వారా తాము చేరిన 20 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. రెన్యువల్స్‌ 75 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో ఫీజు మొత్తం జమ అవుతుంది.  
–శ్రీనివాస్, జాయింట్‌ డైరెక్టర్,సాంఘిక సంక్షేమ శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top