
కేతనకొండ గ్రామ సచివాలయంలో ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమని నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు
సుమారు 90 శాతం మంది ఎకరం లోపు భూమి ఉన్న రైతులే
రియల్టీ, కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయాయి
మిగతా 581 ఎకరాలనూ తీసుకుంటే వ్యవసాయం ఉండదు.. ఇబ్రహీంపట్నంలో పూలింగ్‌ను వ్యతిరేకించిన కూటమి నేతలు
అమరావతిలోనే ఇంకా ప్లాట్లు కేటాయించలేదు.. మాకెప్పుడు?
స్పోర్ట్స్ సిటీతో తమ జీవితాలు దుర్భరం అవుతాయని ఆవేదన
కేతనకొండ సచివాలయం వద్ద నిరసన.. పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం
ఇబ్రహీంపట్నం: ‘‘ఇదివరకు గ్రామంలో దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. రియల్ ఎస్టేట్, కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయింది. మిగిలిన 581 ఎకరాలను స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకుంటే.. మా ఇళ్లు మాత్రమే మిగులుతాయి. ఇక వ్యవసాయం ఎక్కడ చేయాలి?’’ అంటూ టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీల నేతలు ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం వీరంతా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సచివాలయ కార్యదర్శి ఎం.మౌనికకు వినతిపత్రం అందజేశారు.
ఆందోళనలో టీడీపీ నాయకులు కేతనకొండ మాజీ సర్పంచి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పత్రి లేపాక్షిరావు, పత్రి చలపతి, కొమ్మూరి గోపీ, జనసేనకు చెందిన కొమ్మూరి వెంకటస్వామి, మొక్కపాటి చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరం లోపు ఉన్న రైతులు సుమారు 90 శాతం మంది ఉన్నారని, ఏటా మూడు పంటలు పండే భూములను స్పోర్ట్స్ సిటీకి తీసుకుంటే ఎలాగని నిలదీశారు. సన్న, చిన్నకారు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, స్పోర్ట్స్ సిటీతో తమ పొట్టకొట్టొదని వేడుకున్నారు.
కాగా, కేతనకొండ, పరిసర గ్రామాల్లో సుమారు 2,874 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో ప్రకటించారు. దీంతో తమ ప్రాంతంలో వ్యవసాయం కనుమరుగేనని.. జీవితాలు దుర్భరంగా మారతాయని రైతులు వాపోతున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, ఇక తమకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పూలింగ్‌పై పునరాలోచన చేయాలని కోరారు. కాగా, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను పూలింగ్‌కు ఇవ్వబోమని ఇప్పటివరకు రైతులు మాత్రమే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారి బాటలోనే కూటమి నాయకులు ప్రతిఘటించడం గమనార్హం.
కేతనకొండ గ్రామం 1930లో ఉబ్బడివాగు వాగు పక్కన ఏర్పడింది. ప్రస్తుత 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్‌కు 400 ఎకరాలు, పరిశ్రమలు, స్టోన్ క్రషర్లు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల ఏర్పాటుకు 200 ఎకరాలు పోయింది. మిగతాది కూడా తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు, కూటమి నాయకులు ఆందోళన చెబుతున్నారు.
ఉన్నదే 44 సెంట్లు.. అదీ తీసుకుంటారా?
నాకు 44 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. మూడు పంటలు పండిస్తా. అదే కుటుంబానికి ఆసరా. దీనినీ తీసుకుంటారా? గ్రామంలో 90 శాతం మంది ఎకరం లోపు ఉన్న రైతులే. భూములు తీసుకుంటే వారంతా ఏమవాలి. ఎట్టి పరిస్థితిలో పూలింగ్‌లో భూములు ఇవ్వం. –పయ్యావుల రాము, ఇబ్రహీంపట్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి, కేతనకొండ
వ్యవసాయం లేకుంటే నేనేం చేయాలి?
వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటే నేనేం చేయాలి. వ్యవసాయం అలవాటుగా మారింది. భూమి లేకపోతే పంటలు ఉండవు. పశువులకు మేత, రైతు కూలీలకు పని దొరకదు.
–షేక్ ఉద్దండు, రైతు, మాజీ ఎంపీటీసీ, కేతనకొండ