డబ్బుల్లేవ్‌.. ఏ పంటా కొనలేం | Farmers are angry at the government response | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేవ్‌.. ఏ పంటా కొనలేం

Apr 18 2026 5:16 AM | Updated on Apr 18 2026 5:16 AM

Farmers are angry at the government response

మంత్రి అచ్చెన్నకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీ రైతు, కౌలురైతు సంఘ నేతలు

రైతులకు తేల్చి చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు  

అంతకుముందు అచ్చెన్న క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు 

ప్రభుత్వం స్పందించిన తీరుపైనా ఆగ్రహం  

సాక్షి, అమరావతి: మొక్కజొన్నే కాదు... ఏ పంటనూ మేము కొనలేమని, రైతులను ఏ విధంగా­నూ ఆదుకోలేమని, డబ్బుల్లేవని రాష్ట్ర ప్రభు­త్వం చేతులెత్తేసింది. కేంద్రం ఆర్థిక చేయూత ఇస్తే తప్ప మొక్కజొన్న కాదు కదా.. మరే ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు ఆచ్చెన్నాయుడు రైతు సంఘాల నేతల వద్ద ఈ విషయం చెప్పారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతు, కౌలురైతుల సంఘాలు శుక్రవారం మంత్రి అచ్చెన్న క్యాంప్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. 

తొలుత రైతు సంఘాల కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్న క్యాంప్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా జరిగిన ఆందోళనలో పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అచ్చెన్నను కలిసి వినతిపత్రం ఇచ్చారు. 

మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్‌లో రూ.1400–1600 మించి కొనుగోలు చేయడం లేదని, దళారుల దోపిడీ కారణంగా ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ, జొన్న, కంది తదితర రైతులదీ ఇదే పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవన్నారు. కేంద్రం నుంచి నిధులొస్తే కొనుగోలు చేస్తామన్నారు. 

రైతు సంఘ నాయకులు జోక్యం చేసుకుని పొరుగనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న  చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతోందని నిలదీశారు. కేంద్రం నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్న బదులిస్తూ రాష్ట్రంలో ఈఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగిందని, ఆమేరకు పెరిగిన దిగుబడులను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.5 వేల కోట్లు కావాలని, ఆ స్థాయిలో నిధులు ప్రభుత్వం వద్ద ఎక్కడనున్నాయంటూ ఎదురు ప్రశ్న వేశారు. 

ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్‌లో జరి­పిన కేటాయింపుల నుంచి ఖర్చు చేయాలని రైతు నాయకులు కోరగా, కుదరదని తేల్చి చెప్పా­రు. మొక్కజొన్న ఒక్కటే కాదు.. మరే ఇతర పంట ఉత్పత్తులను కూడా కేంద్రం ఆర్థిక చేయూత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో కొనుగోలు చేసే పరిస్థితిలో లేదని మంత్రి స్పష్టం చేశారు. అయినా సీఎంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ముక్తసరిగా మంత్రి చెప్పుకొచ్చారు.

రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉండీ ఉపయోగమేంటి? 
అనంతరం మీడియాతో రైతు సంఘ నేతలు మాట్లాడుతూ రైతులు ఓ వైపు సంక్షోభంలో కూరుకుపోతుంటే ఆదుకోవాల్సి­న ప్రభు­త్వం ఇలా చేతులెత్తేయడం దారుణమన్నారు. రైతులను ఆదుకోలేని ప్రభుత్వం ఉండీ ఉపయో­గమేంటని ప్రశ్నించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. ప్రభాకరరెడ్డి,  సీనియర్‌ నాయకులు వై. కేశవరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి. ఆంజనేయులు, ఏపీ కౌలు రైతు­ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. రాధాకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. బలరాం,  రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు వ­ల్లూరు భారతి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకురాలు భీమిరెడ్డి కోటేశ్వరి, వివిధ జిల్లాల సంఘ ప్రతినిధులు  పాల్గొన్నారు.

హైవేపై మొక్కజొన్న రైతుల ధర్నా
నరసరావుపేట/రొంపిచర్ల: ప్రకటించిన మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు శుక్రవారం ధర్నా చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మార్కెట్‌ యార్డుకు ఎదురుగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. 

మొక్కజొన్న రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని తూర్పా­రబట్టారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి తదితరులు ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు పలికారు. వందలాది మంది రైతులు రోడ్డుపై నిరసనకు దిగడంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement