
‘ఎమ్మార్’ పేరిట ఏమార్చే కుట్ర.. చంద్రబాబు డైరెక్షన్‌లో ‘ఈనాడు’ దుష్ప్రచారం
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్‌పై విష ప్రచారం
ఆ కేసులో ఆయన ఏ–1 నిందితుడని అసత్య కథనం
ఆ కేసు నిందితుల జాబితాలో వైఎస్ జగన్ లేనే లేరు
అందుకు సీబీఐ చార్జ్‌షీటే ప్రత్యక్ష సాక్ష్యం
రాజకీయ కుట్రతోనే ఈనాడు అసత్య కథనం
ప్రజల దృష్టి మళ్లించేందుకు సిట్ లీకులు.. ఎల్లో మీడియా రంకెలు
అందరూ జగన్‌కు సన్నిహితులే అంటూ వక్రీకరణ
అక్రమ కేసులో నిందితుల బెయిల్‌ను అడ్డుకోవడమే లక్ష్యం
చంద్రబాబు, రామోజీ కుటుంబాలదే క్విడ్ ప్రో కో బంధం
ఫిల్మ్ సిటీ మొదలు మార్గదర్శి వరకు బాబు సహకారం
అందుకే వైఎస్ జగన్‌పై పచ్చ పత్రిక దుష్ప్రచార కుట్ర
సాక్షి, అమరావతి: టీడీపీ కరపత్రిక, నిత్యం అసత్యాలు కొంగొత్తగా వల్లించే విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి బరితెగించింది. దశాబ్దాలుగా తనకు అలవాటైన రీతిలో ఉషోదయాన్నే అవాస్తవ సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరి తెగించింది. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారానికి తెగబడింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితాలోనే లేని వైఎస్ జగన్‌ను.. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ–1) పేర్కొంటూ ఓ అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పాత్రికేయ విలువలను మరోసారి దిగజార్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు డైరెక్షన్‌లో డైవర్షన్ రాజకీయానికి పాల్పడింది.
నిస్సిగ్గుగా ‘ఈనాడు’ తప్పుడు రాతలు
చంద్రబాబు కుట్రలో భాగంగా ఈనాడు 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును ఉద్దేశ పూర్వకంగా తెరపైకి తీసుకువచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది.
వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని.. విదేశాలకు అక్రమంగా నిధులు తరలించారని కూడా అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది. కనీసం అటువంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని కూడా యత్నించ లేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించినా అసలు వాస్తవాలు వెల్లడవుతాయి.
కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు పత్రిక అవేమీ పట్టించుకోలేదు. అసత్య సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. అయితే ‘ఈనాడు’ ప్రచురించిందంతా వాస్తవం అని అమాయకంగా నమ్మేందుకు ఇవి 1995 వైస్రాయ్ హోటల్ కుట్ర నాటి రోజులు కావు. ఈనాడు పత్రిక బండారం ఎప్పుడో బట్టబయలైంది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో వైఎస్ జగన్‌కు సంబంధమే లేదు
2010–11లో సీబీఐ నమోదు చేసిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ కేసులో ఆయన ప్రధాన నిందితుడు కాదు కదా.. సాధారణ నిందితుడు కూడా కాదు. అసలు ఆ కేసులో నిందితుల జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. ఆయనపై సీబీఐ ఆ కేసు నమోదు చేయనే లేదు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు నిందితుల జాబితా ఇదే.. ఇందులో వైఎస్ జగన్ పేరు లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితులు వీరే..
బీపీ ఆచార్య (ఏ1), ఎమ్మార్ ప్రాపర్టీస్ (ఏ2), ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ (ఏ3), ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ (ఏ4), స్టైలిష్ హోల్మెస్ అండ్ రియల్ ఎస్టేట్స్ (ఏ5), కోనేరు రాజేంద్ర ప్రసాద్ (ఏ6), నర్రెడ్డి సునీల్ రెడ్డి (ఏ7), జీవీ విజయ్ రాఘవ్ (ఏ8), శ్రీకాంత్ జోషి (ఏ9), బోల్డర్ హిల్స్ లీషూర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏ10), ఎల్వీ సుబ్రహ్మణ్యం (ఏ11), విశ్వేశ్వరరావు (ఏ12), మధు కోనేరు (ఏ13), టి.రంగారావు(ఏ14) నిందితులుగా ఉన్నారు.
వీరిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం, మధు కోనేరులపై అభియోగాలను న్యాయస్థానం ఇప్పటికే కొట్టి వేసింది. కేసు విచారణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 19న న్యాయస్థానంలో తదుపరి విచారణ ఉంది. దీన్నిబట్టి ఈ కేసులో నిందితుల జాబితాలో ఎక్కడా లేనప్పటికీ వైఎస్ జగన్‌ను ఏ1గా పేర్కొంటూ ఈనాడు కుట్ర పూరితంగానే అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని స్పష్టమవుతోంది.
బాబు డైరెక్షన్‌లోనే ‘ఈనాడు’ యాక్షన్
⇒ చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈనాడు అసత్య కథనాన్ని ప్రచురించింది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తగానే మద్యం విధానంపై అక్రమ కేసు పేరిట సిట్ రంగంలోకి దిగుతుంది.. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుంది.. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తోక పత్రికలు వెంటనే రంకెలు వేస్తాయి. మోకాలికీ బోడి గుండుకు ముడి పెడుతూ అసత్య కథనాలు ప్రచురిస్తాయి.
⇒ ఈ కేసులో సిట్ ఎవర్ని అరెస్టు చేయనుందో ముందే లీకులు ఇస్తుంది. ఆ వెంటనే ఆయనే ఈ కేసులో అత్యంత కీలకం అంటూ ఈనాడు, ఇతర తోక పత్రికలు కథనాలు ప్రచురిస్తాయి. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు అని పేర్కొంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి.. ఇలా వీరందరిపై ఎల్లో మీడియా బురదజల్లడమే పనిగా పెట్టుకుంటుంది.
⇒ ఆ జాబితాలో తాజాగా చేరిన పేరు సునీల్ రెడ్డి. న్యాయవాది, చిన్న వ్యాపారస్తుడైన ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా వక్రభాష్యం చెబుతున్నాయి. ఆయన గత పదేళ్లలో వైఎస్ జగన్‌ను కలిసిందే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్కసారి కూడా విజయవాడకు గానీ, అమరావతికి గానీ వచ్చిందే లేదు. కానీ ఆయన వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడంటూ ఉద్దేశ పూరక్వంగా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.
⇒ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సొంతంగా కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఎంతో మంది వృత్తి నిపుణులు పని చేస్తున్నారు. వైఎస్ జగన్ తమ వ్యాపారాలను వారి ద్వారా నిర్వహిస్తారు. అంతే గానీ, సిట్ చెప్పినట్టుగా ఇతరులెవరితోనో వ్యవహారాలు నిర్వహించాల్సిన అవసరం ఆయనకు ఏమాత్రం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపేందుకే సిట్, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయన్నది సుస్పష్టం.
⇒ మద్యం అక్రమ కేసులో అక్రమంగా అరెస్టు అయిన నిందితుల బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ ఇదే కుట్రను అమలు చేస్తున్నారు. ఎవరు ఆఫ్రికా దేశాల్లోనో మరెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నా.. ఈ అక్రమ కేసుకు ముడి పెడుతున్నారు. అవన్నీ అక్రమ పెట్టుబడులే అంటూ బురద జల్లుతున్నారు.
చంద్రబాబు, రామోజీ కుటుంబ ట్రేడ్ మార్క్ కుట్ర
⇒ పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా చంద్రబాబు– ఈనాడు వ్యవహారం సాగుతోంది. తమ రాజకీయ స్వార్థం, ఆర్థిక దోపిడీ కోసం తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ.. రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ కుట్రలకు పాల్పడేందుకు చంద్రబాబు, రామోజీ కుటుంబ మార్కు కుతంత్రం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఆ క్విడ్ ప్రోకో కుట్రల్లో చంద్రబాబు, రామోజీ కుటుంబాలే లబ్ధిదారులు అన్నది బహిరంగ రహస్యం.
⇒ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో చంద్రబాబు సీఎం అయిన వైస్రాయ్ హోటల్ కుట్రలో ఈనాడు పత్రిక ప్రధాన భాగస్వామి. 1995లో సీఎంగా ఉన్న ఎన్టీరామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా కథనాలతో దుష్ప్రచారం చేసి పాత్రికేయ విలువలకు పాతరేసింది.
⇒ చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు. ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది.
⇒ ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ వేల కోట్ల రూపాయాల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. క్విడ్ ప్రో కో కుట్రలో భాగస్వాములు అంటే చంద్రబాబు, రామోజీ కుటుంబాలే అన్నది బహిరంగ రహస్యం. కానీ తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడు పత్రిక ద్వారా దుష్ప్రచారం చేయడం చంద్రబాబు, రామోజీ కుటుంబాల మార్కు కుతంత్రం. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ జగన్‌ను ఆ కేసులో ప్రధాన నిందితుడు అని ఈనాడు పత్రిక ప్రచురించిన అసత్య కథనమే అందుకు తాజా తార్కాణం.