కార్పొరేషన్ల చైర్మన్లకు జెడ్పీల్లో ఎక్స్‌అఫిషియో సభ్యత్వం

Ex-officio membership in ZP for the chairmen of corporations - Sakshi

ఆ హోదాలో జిల్లా స్టాండింగ్‌ కమిటీల్లో పాల్గొనే అవకాశం

పంచాయతీరాజ్‌ చట్టం సవరణకు సర్కారు కసరత్తు 

సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫిషియో సభ్యత్వం కల్పించనుంది. ఇందుకు పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. సాధారణంగా.. జిల్లా పరిషత్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కొనసాగుతుంటారు. అలాగే, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తమతమ వర్గాల సమస్యలను జెడ్పీ సమావేశాల్లో  ప్రస్తావించేందుకు వీలుగా వారికీ ఎక్స్‌ అఫిషియో సభ్యత్వం కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుతమున్న 61 కార్పొరేషన్ల చైర్మన్లు తాము కోరుకున్న జిల్లాలో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా హోదా పొందే వీలు కలుగుతుంది.

ఓటు హక్కు మాత్రం ఉండదు
ఇదిలా ఉంటే.. జెడ్పీలో ఇప్పటికే ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు జెడ్పీ చైర్మన్‌ ఎంపిక తదితర అంశాల్లో ఓటు హక్కు లేదు. అలాగే, కార్పొరేషన్‌ చైర్మన్లకూ ఇది వర్తిస్తుందని పంచాయతీరాజ్‌ శాఖాధికారులు వెల్లడించారు. కానీ, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే స్టాండింగ్‌ కమిటీల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుని హోదాలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు స్టాండింగ్‌ కమిటీ సభ్యునిగా కూడా నియమితులయ్యే వీలుంటుందని వారు వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top