గ్యాస్‌ తంటాలు.. విద్యుత్‌ మంటలు | EPDCL Power Consumption Nears the Century Mark | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ తంటాలు.. విద్యుత్‌ మంటలు

Mar 22 2026 4:58 AM | Updated on Mar 22 2026 4:58 AM

EPDCL Power Consumption Nears the Century Mark

సెంచరీ(మి.యూ.)కి చేరువలో ఈపీడీసీఎల్‌ విద్యుత్‌ వినియోగం 

మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయికి చేరిన కరెంట్‌ వాడకం

ఈపీడీసీఎల్‌ పరిధిలో 16 శాతం పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ 

34 డిగ్రీల ఉష్ణోగ్రతలే వినియోగ  పెరుగుదలకు ఒక కారణం 

గ్యాస్‌ కొరతతో ఎలక్ట్రిక్‌ స్టౌలు, ఇండక్షన్‌ల వినియోగం మరో కారణం 

సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్‌ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. సాగర నగరంలో ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుంటేం మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఇళ్లల్లో ‘విద్యుత్‌ మంటలు’ రేపుతున్నాయి. ఈ అసాధారణ పరిస్థితుల ప్రభావంతో నగరంలో విద్యుత్‌ వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. 

మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ఓవైపు ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతుండగాం మరోవైపు యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్‌ కొరతకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్‌ స్టౌవ్‌ల వినియోగం ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈపీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరుకుంది. గత పది రోజులుగా రోజువారీ వినియోగంలో సుమారు 16 శాతం అదనపు లోడు నమోదవుతోంది. 

మార్చిలోనే మండుతున్న ఎండలు 
నగరంలో ఎండల ప్రభావం మంటపుట్టిస్తోంది. నడివేసవి రాకముందే ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో విద్యుత్‌ వినియోగం కూడా రికార్డు స్థాయికి చేరుతోంది. గాలిలో ఉష్ణోగ్రతలు 32–34 డిగ్రీల లోపే నమోదవుతున్నా.. ఉక్కబోత మాత్రం 40 డిగ్రీల ప్రభావాన్ని చూపిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వేసవి మరింత ఇబ్బందికరంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజల్లో ఇప్పుడే గుబులు పుట్టిస్తున్నాయి. 

వేడి నుంచి ఉపశమనం పొందడానికి అంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విపరీతంగా వినియోగిస్తున్నారు. సాధారణంగా ఈపీడీసీఎల్‌ పరిధిలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి విద్యుత్‌ వాడకం పెరుగుతుంది. కానీ ఈసారి మార్చి మొదటి వారం నుంచే డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరింది. 

16 మిలియన్‌ యూనిట్లు అదనం 
ఈపీడీసీఎల్‌ పరిధిలో మార్చి నెలలో ప్రతి రోజూ సగటున 78 నుంచి 81 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతుంటుంది. అయితే భానుడి ప్రతాపంతో ఈ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. గత కొద్ది రోజులుగా రోజువారీ సగటు విద్యుత్‌ వినియోగం కంటే 14 నుంచి 16 మిలియన్‌ యూనిట్లు అధికంగా నమోదవుతోంది. ప్రతి రోజూ వినియోగం సెంచరీకి (100 మిలియన్‌ యూనిట్లు) చేరువలో ఉండటం గమనార్హం. ఈ నెల 7వ తేదీన 96.50 మిలియన్‌ యూనిట్లు, 12వ తేదీన 96.37 మిలియన్‌ యూనిట్లుగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

‘ఇండక్షన్‌’ వినియోగం పెరుగుదల 
విద్యుత్‌ వినియోగం పెరగడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు.. విదేశాల్లో జరుగుతున్న యుద్ధం కూడా పరోక్షంగా ఈపీడీసీఎల్‌పై భారం వేసింది. యుద్ధం కారణంగా వంటగ్యాస్‌ సరఫరాలో అనిశి్చతి, పెరిగిన సిలిండర్‌ ధరల ప్రభావం నేరుగా సామాన్యుడి వంటగదిపై పడింది. 

చాలామంది వినియోగదారులు వంటగ్యాస్‌కు బదులుగా ఇండక్షన్‌ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్‌ స్టౌవ్‌లు, ఇమ్మెర్షన్‌ హీటర్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గృహ వినియోగంలో విద్యుత్‌ డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఒక్కో ఇంట్లో వినియోగించే ఇండక్షన్‌ స్టౌవ్‌లు గ్రిడ్‌పై తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నాయి. 

అధికారుల కసరత్తు 
శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు జిల్లాలతో పోలిస్తే విశాఖ నగరంలో డిమాండ్‌ గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా విశాఖలో ఈ సమయంలో 25 నుంచి 28 మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉండాలి.. కానీ ఈసారి అది 31 మిలియన్‌ యూనిట్లు దాటుతోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సాయంత్రం వేళల్లో (పీక్‌ అవర్స్‌) గరిష్ట డిమాండ్‌ 4800 మెగావాట్ల మార్కును దాటుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు తలెత్తకుండా తనిఖీలు చేపట్టడంతో పాటు, నిరంతర సరఫరా కోసం గ్రిడ్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. 

విద్యుత్‌ పొదుపు పాటించాలి 
డిమాండ్‌ పెరుగుతున్నా కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. నిరంతరం సర్కిల్స్‌ వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నాం. వినియోగదారులు కూడా అనవసరమైన విద్యుత్‌ వాడకాన్ని తగ్గించి సహకరించాలి. – పృథ్వితేజ్‌ ఇమ్మడి, ఈపీడీసీఎల్‌ సీఎండీ 

Advertisement
 
Advertisement
Advertisement