విద్యుత్‌ లెక్కల్లో దాగుడు మూతలు | The electricity demand across the state is 278 million units per day | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ లెక్కల్లో దాగుడు మూతలు

May 22 2026 3:24 AM | Updated on May 22 2026 3:26 AM

The electricity demand across the state is 278 million units per day

రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 278 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌  

ఆ మేరకు అందుబాటులో లేని ఉత్పత్తి

విద్యుత్‌ కొనుగోలు ఖర్చులను  దాచేస్తున్న ప్రభుత్వం 

కోతలతో డిమాండ్‌ను సమతుల్యం చేసే ప్రయత్నం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయికి చేరింది. దానికి సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి మాత్రం రాష్ట్రంలో జరగడం లేదు. జల విద్యుత్‌ నామమాత్రంగానే ఉండగా.. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధర చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. మరోవైపు అనధికార విద్యుత్‌ కోతలతో వినియోగానికి సరిపడా సరఫరా చేస్తున్నట్టు లెక్కల్లో చూపిస్తోంది. 

42.95 శాతం అధికం 
రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ విద్యుత్‌ వినియోగం 278.911 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే ఇది 42.95 శాతం అధికం కావడం గమనార్హం. మధ్యాహ్నం వేళ గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 14,358 మెగావాట్లకు చేరుతుండగా.. సాయంత్రం పీక్‌ డిమాండ్‌ 12,377 మెగావాట్లు ఉంటోంది. రోజంతా సగటు డిమాండ్‌ 11,621 మెగావాట్లుగా నమోదైనట్లు ‘స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌’ డైలీ బులెటిన్‌లో అధికారికంగా వెల్లడించింది. 

గత ఏడాది ఇదే రోజున గరిష్ట డిమాండ్‌ 9,071 మెగావాట్లు మాత్రమే ఉండగా.. ఈసారి 58.28 శాతం పెరుగుదల నమో­దైనట్టు స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి 112.642 మిలియన్‌ యూనిట్లు, జలవిద్యుత్‌ నుంచి 6.133 మిలియన్‌ యూని­ట్లు, కేంద్ర విద్యుత్‌ కేంద్రాల నుంచి 31.710 మిలియన్‌ యూ­­నిట్లు సమకూరుతోంది. పవన విద్యుత్‌ ద్వారా 34.418 మిలియన్‌ యూనిట్లు, సౌర విద్యుత్‌ ద్వారా 31.748 మిలియన్‌ యూనిట్లు, స్వతంత్ర ఉత్పత్తిదారు(ఐపీపీ)ల నుంచి 48.209 మిలియన్‌ యూనిట్లు వస్తోంది. ఇతర వనరుల నుంచి 14.051 మిలియన్‌ యూనిట్లు సమకూరాయి. 

సమాచారం మాయం 
రాష్ట్రంలో డిమాండ్‌ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం బయటి నుంచి భారీఎత్తున విద్యుత్‌ కొనుగోలు చేస్తోంది. అయితే.. ఆ కొనుగోళ్ల ఖర్చుల వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టడం లేదు. డైలీ బులెటిన్‌లో కూడా షార్ట్‌ టర్మ్‌ పవర్‌ పర్చేజ్‌  వివరాల వద్ద ‘సమాచారం అందుబాటులో లేదు (నో రికార్డ్‌ ఫౌండ్‌)’ అని మాత్రమే పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. నిజానికి పవర్‌ ఎక్చ్సేంజీల నుంచి కొంటున్న విద్యుత్‌నే ఇతర వనరుల నుంచి సమకూరుతున్నట్టుగా లెక్కల్లో చూపిస్తున్నట్టు తెలుస్తోంది.  

ఆందోళన కలిగిస్తున్న బొగ్గు నిల్వలు 
మరోవైపు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 7.85 రోజులకు సరిపడే నిల్వలు, రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌లో 6.58 రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నట్టు నివేదిక చెబుతోంది. ఎండల తీవ్రత కొనసాగితే విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ ఏడాది రోజువారీ విద్యుత్‌ వినియోగం 280 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని ముందుగానే గుర్తించారు. కానీ ఆ మేరకు విద్యుత్‌ను సమకూర్చుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. విద్యుత్‌ కోతలతో డిమాండ్‌ను సమతుల్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ విషయం బయటపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలపై నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ) ఇచ్చే నివేదికను సైతం దాచిపెడుతోంది. 

విద్యుత్‌ కొనుగోళ్ల సమాచారం లేదంటూ ఎస్‌ఎల్‌డీసీ నివేదికలో పేర్కొన్న భాగం 

‘ఎన్‌ఎల్‌డీసీ’ విద్యుత్‌ కోతల సమాచారం లేదంటూ ఎస్‌ఎల్‌డీసీ నివేదికలో పేర్కొన్న భాగం 

Advertisement
 
Advertisement
Advertisement