ఇక ఈవీలు.. ఏఐ

Electric vehicle industry leaders On E-mobility artificial intelligence - Sakshi

ఈ–మొబిలిటీ, కృత్రిమ మేధదే భవిష్యత్తు

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీపైనా దృష్టి పెట్టాలి

విశాఖ జీఐఎస్‌ సెషన్లలో పరిశ్రమ వర్గాల సూచన 

(గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ కార్లు, బస్సులు, ట్రక్కులు లాంటి ఈ–మొబిలిటీదేనని ఎలక్ట్రిక్‌ వాహన రంగ పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారు. వాహనాల ధరలు తగ్గి చార్జింగ్‌ పరమైన సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా ఆటోమొబైల్, ఎలక్ట్రిక్‌ వాహనాలపై నిర్వహించిన సెషన్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ కేవీ ప్రదీప్, కియా మోటార్స్‌ ఇండియా వీపీ హర్‌దీప్‌ బ్రార్, టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవీల బ్యాటరీలు దిగుమతి చేసుకోవడం కొనసాగినంత కాలం వాహనాల ధర అధిక స్థాయిలోనే ఉంటుందని, దేశీయంగా తయారీ చేస్తే భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. ఈవీల మార్కెట్‌ యూరప్, అమెరికాలో గణనీయంగా ఉండగా భారత్‌లో ప్రస్తుతం 1–2 శాతం స్థాయిలోనే ఉందని హర్‌దీప్‌ తెలిపారు. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే వీటి ధర 80 శాతం అధికంగా ఉండటం, చార్జింగ్‌ సమస్యలు, మైలేజీపరమైన ఆందోళనే ఇందుకు కారణమన్నారు.

ఈ సవాళ్లను అధిగమించేలా దేశీ పరిశ్రమ సరైన దిశలో ముందుకు సాగుతోందని వివరించారు. 2025 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వాటా 5 శాతానికి, అటుపైన 2030 నాటికల్లా 30 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నట్లు హర్‌దీప్‌ చెప్పారు. 2025 నాటికే 45 పైచిలుకు ఈవీల మోడళ్లు లభ్యమవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 5,600 బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు ప్రకటించగా కంపెనీలు పోటీపడి బిడ్లు వేయడం ఈవీల మార్కెట్లో వస్తున్న మార్పులకు నిదర్శనమన్నారు.

ఇక ఎలక్ట్రిక్‌ కార్లే: మార్టిన్‌ ఎబర్‌హార్ట్, టెస్లా సహ వ్యవస్థాపకుడు  
త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ కార్లే ఉంటాయని అమెరికన్‌ విద్యుత్‌ వాహనాల దిగ్గజం టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌ చెప్పారు. కేవలం టెస్లా కార్లే కాకుండా ఇతర కంపెనీలూ ఈ విభాగంలో గణనీయంగా పురోగతి సాధించాయని గ్లో­బల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  

ప్రపంచంలోనే అతి పెద్ద వాహనాల మార్కెట్ల­లో భారత్‌ కూడా ఒకటని ఎబర్‌హార్డ్‌ తెలి­పా­రు. త్వరలోనే ఇక్కడ కూడా పూర్తిగా ఎల­క్ట్రిక్‌ కార్లనే చూడ­వచ్చ­న్నారు. దీన్ని గుర్తించి అవ­కాశాన్ని అందిపు­చ్చు­కునే సంస్థలు లబ్ధి పొందుతాయ­న్నారు. చార్జింగ్, మౌలిక సదుపా­యాల కొరత అనేది సమస్యే కాదన్నారు. కియా సంస్థ ఏపీలో అద్భుతమైన కార్లను ఉత్పత్తి చేస్తోందని ప్రశంసించారు.

ఆరంభంలో అన్నీ సమస్యలే..
ఎలక్ట్రిక్‌ కార్లు తొలిసారిగా తెరపైకి వచ్చిన­ప్పుడు ఆకర్షణీయంగా లేకపోవడంతో ప్రజ­లు ఇష్టపడే వారు కారని ఎబర్‌హార్డ్‌ చెప్పా­రు. దీంతో వాటికి స్పోర్ట్స్‌’ లుక్‌ కల్పించేందుకు తాము ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలి­పారు. సగం మంది సిబ్బందిని ఆటోమోటివ్‌ రంగం నుంచి, మిగతా వారిని సిలికాన్‌ వ్యాలీ నుంచి నియమించుకున్నట్లు చెప్పారు. 2 దశాబ్దాల క్రితం తాము ఎలక్ట్రిక్‌ వాహ­నా­లను తెరపైకి తెచ్చినప్పుడు పలు సమ­స్యలు ఎదుర్కొన్న­ట్లు చెప్పారు.

‘ఉత్పత్తి సంస్థ­ల నుంచి పరికరాల సరఫరా సరిగా ఉండేది కాదు. లిథియం అయాన్‌ బ్యాటరీల భద్రతప­రం­గా పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. క్రాష్‌ టెస్టులు నిర్వహించాలన్నా కష్టంగా ఉండేది. ఆటో డీలర్ల ఫ్రాంచైజీల పరంగానూ సమస్య­లు తలెత్తాయి. నెమ్మదిగా వాటిని అధిగమించాం. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకున్నాం. అప్పట్లో ఎలక్ట్రిక్‌ కార్లకు భవిష్యత్‌ లేదని అంతా పెదవి విరిచారు. ప్రస్తుతం భవిష్యత్తంతా వాటిదే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది’ అని తెలిపారు.

చైనా ప్లస్‌ వన్‌తో భారత్‌కు ప్రయోజనం
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల కోసం ఇన్నాళ్లు చైనాపై ఆధారపడిన దేశాలు కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలపై (చైనా ప్లస్‌ వన్‌ విధానం) దృష్టి పెడుతున్నాయని సాల్‌కాంప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండియా ఎండీ శశికుమార్‌ గంధం తెలిపారు. మన దేశం అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్‌ఎంఈ) భాగస్వాములుగా చేయాలన్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌పై నిర్వహించిన సెషన్‌లో ఎఫ్‌ట్రానిక్స్‌ సీఈవో దాసరి రామకృష్ణ, బ్లూస్టార్‌ క్‌లైమేటెక్‌ ప్రెసిడెంట్‌ పీవీ రావు తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి విధానపరంగా పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోందని, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) లాంటి స్కీములు ప్రయోజనకరంగా ఉన్నాయని సాల్‌కాంప్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండియా ఎండీ శశికుమార్‌ పేర్కొన్నారు. వీటి ఊతంతో దీర్ఘకాలంలో నిలదొక్కుకునేందుకు పరిశ్రమ తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు.

నిర్దిష్టంగా దృష్టి సారిస్తే..
ఎలక్ట్రానిక్స్‌ తయారీకి సంబంధించి అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్టంగా 2–3 విభాగాలను ఎంచుకుని వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా పీసీ బోర్డుల తయారీ, ఇతర పరికరాలపై దృష్టి పెట్టాలన్నారు. తాము దక్షిణాదిలో ప్లాంటు కోసం అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత ఆకర్షణీయంగా కనిపించిందని పీవీ రావు చెప్పారు.

ప్రభుత్వం అత్యుత్తమ సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించిందని, తమ కార్యకలాపాలను మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమ ప్లాంటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి పైగా ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం ఇది రెట్టింపు స్థాయికి 
చేరుకుంటుందని తెలిపారు.

అన్నింటా కృత్రిమ మేథ
వైద్యం విద్య తదితర అన్ని విభాగాల్లో కృత్రిమ మేథకు (ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐపై పట్టు సాధించేందుకు యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించి పాఠశాల, కళాశాల స్థాయి నుంచి అవగాహన పెంపొందించాలి. ప్రధానంగా గణితంపై మరింత పట్టు సాధించేలా ప్రోత్సహించాలి అని ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ సత్యనారాయణ అన్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) అంశంపై జరిగిన సెషన్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఐటీలు, ఎయిమ్స్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ఉన్నాయని చెప్పారు. మాస్‌ మ్యుచువల్‌ హెడ్‌ రవి తంగిరాల, ఐట్యాప్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ కొసరాజు, టెక్నోజెన్‌ సీఈవో లక్స్‌ రావు చేపూరి, టెక్‌ బుల్స్‌ డైరెక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు ఈ సెషన్‌లో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top