 
													సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు.
అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
