రేటు నాట్‌ 'గుడ్డు' | Egg exports to Gulf countries halted | Sakshi
Sakshi News home page

రేటు నాట్‌ 'గుడ్డు'

Mar 28 2026 4:04 AM | Updated on Mar 28 2026 4:04 AM

Egg exports to Gulf countries halted

పశ్చిమాసియా యుద్ధ్ద ప్రభావం 

గల్ఫ్‌ దేశాలకు నిలిచిన గుడ్ల ఎగుమతులు 

లోకల్‌ ఎగుమతులపై ఇతర రాష్ట్రాల పోటీ ప్రభావం  

గుడ్డు ధర రూ. 5.50 నుంచి రూ.3.95కు పతనం  

సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో సుమారు 250 పౌల్ట్రీలు విస్తరించి ఉన్నాయి. గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 70 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, తమిళనాడులోని నమ్మకల్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగమవుతున్నాయి. 

చలి తీవ్రతతో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తగ్గడం వలన గుడ్లు వినియోగం పెరుగుతుంది. జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్‌ ఏర్పడి రైతు ధర ఆశాజనకంగా ఉంటుంది. డిసెంబరు చివరి వారంలో ఫాంగేట్‌ వద్ద రూ. 6.95లకు చేరి రికార్డు ధర నమోదు చేసుకుంది. రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ రికార్డు ధర మూన్నాళ్ల ముచ్చటయ్యింది. జనవరి నుంచి రూ.5.50 నుంచి రూ.4.50 మధ్య ఒడిదుడుకులకు లోనవుతూ వచ్చింది.  

వార్‌ ప్రభావం  
సాధారణంగానే ఎండలు ముదిరేకొద్ది గుడ్డు ధర తగ్గుతుంది. కాగా అమెరికా, ఇజ్రాయేల్‌– ఇరాన్‌ యుద్ధం దీనికి మరింత ఆజ్యం పోసింది. తమిళనాడులోని నమ్మకల్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు జరిగే గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే జిల్లా నుంచి ఎగుమతులు జరుగుతున్న ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం స్థానిక ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అక్కడి ట్రేడర్స్‌ నిర్ణయించిన ధరకు రైతులు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. 

పశ్చిమాసియా కల్లోలంతో గల్ఫ్‌ దేశాలకు ఎగుమతులు జరుగక పౌల్ట్రీల్లో గుడ్లు నిల్వలు పేరుకుపోయి ధర పతనమవుతోంది. రెండు వారాల క్రితం ఫాంగేట్‌ వద్ద రూ. 5.50లు వరకు ఉన్న గుడ్డు ధర గురువారం నాటికి రూ.3.95లకు తగ్గిపోయింది. ధర తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తున్నా రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టేస్తోంది. పెరిగిన మేత, మందుల ధరలు, నిర్వహణ వ్యయంతో ఒక్కో గుడ్డు ఉత్పత్తి చేసేందుకు ఐదు రూపాయలకు పైనే వ్యయమవుతుందని కోళ్ల రైతులు అంటున్నారు. ప్రస్తుత ధరతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.

మున్ముందు గడ్డు కాలమే 
ఎండలు ముదురుతుండటం కోళ్ల రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేకొద్దీ కోళ్ల మరణాలు పెరుగుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 25 నుంచి 30 వరకు కోళ్లు మృత్యువాత పడితే వేసవిలో వీటి సంఖ్య రెండు మూడు రెట్లు పెరుగుతుంది. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ. 200కు పైనే నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరోపక్క ఎండల తీవ్రతతో రోజువారీ గుడ్లు ఉత్పత్తి 10 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోంది. 

వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్‌ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం పెరగనుండటం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది.  ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోళ్ల రైతులు కోరుతున్నారు. కోళ్ల మేతలు సబ్సిడీపై అందించాలని, విద్యుత్, మందులు తదితర వాటిపై రాయితీలతో ఆదుకోవాలంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement