విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు | Ebola tests for foreign travelers | Sakshi
Sakshi News home page

విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు

May 25 2026 5:22 AM | Updated on May 25 2026 10:34 AM

Ebola tests for foreign travelers

విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో పరీక్షలు 

ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచన

సాక్షి, అమరావతి: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ వ్యాపించడంతో మరణా­లు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. దీంతో కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఎబోలా నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు. వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులను క్వారంటైన్‌ చేసి, పక్కనున్న వారికి కూడా వెంటనే వైద్య పరీక్షలు చేస్తామన్నారు. అలాగే విశాఖ ఓడరేవు అధికారులతో వైద్య శాఖ సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాల్లోని బోధనాస్పత్రుల్లో 15 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాలకు ప్రయాణించవద్దని ఇప్పటికే కేంద్రం కూడా స్పష్టం చేసింది. 

ఎబోలా లక్షణాలు ఇలా..  
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం వైరస్‌ సోకిన వారికి కొన్ని వారాలపాటు లక్షణాలు బయటపడవు. దీంతో తక్కువ కాలంలో ఎక్కువ మందికి వైరస్‌ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. సాధారణ జ్వరం మొదలై అకస్మాత్తుగా జ్వరం పెరిగి, శరీరమంతా బలహీనపడుతుంది. తల, గొంతు, కండరాల నొప్పులు తీవ్రంగా తలెత్తుతాయి. రోజు రోజుకూ నొప్పులు మరింత తీవ్రం అవ్వడంతో పాటు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబారడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్‌ బారినపడ్డ వారిలో కనిపిస్తాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement