
పరోక్ష సేవకూ అవకాశం.. టికెట్ రూ.1,500
11 రోజులకు రూ. 11,116
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈనెల 22 నుంచి 11 రోజుల పాటు నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఆర్జిత సేవా టికెట్ల రుసుంను దేవస్థాన అధికారులు ఖరారు చేశారు. ఉత్సవాల్లో ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ.5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ.3వేలు, మూలా నక్షత్రం రోజున రూ.5వేలుగా నిర్ణయించారు. ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చనకు రూ. 3 వేలు, ప్రత్యేక చండీహోమంకు రూ.4 వేలు ఖరారు చేశారు.
ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చన ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చండీహోమం యాగశాలలో నిర్వహిస్తారు. ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలి రోజున మాత్రం ప్రత్యేక కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిప్టు మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పరోక్ష సేవకు రూ.1,500: ఉత్సవాలలో నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమాలను పరోక్షంగా జరిపించుకునే అవకాశాన్ని కూడా దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఒకరోజు పరోక్ష సేవకు రూ.1,500గా, ఇక 11 రోజుల పాటు సేవకు రూ. 11,116గా నిర్ణయించినట్లు సమాచారం. పరోక్ష సేవలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు ఉత్సవాల అనంతరం అమ్మవారి ప్రసాదాలను పోస్టు ద్వారా భక్తులు తెలిపిన అడ్రస్సుకు పంపుతామని ఆలయ సిబ్బంది తెలిపారు.