టీకా ఉత్పత్తి కంపెనీలది.. నియంత్రణ కేంద్రానిది  | Difference Between The Production Requirement Of Covid Vaccines | Sakshi
Sakshi News home page

టీకా ఉత్పత్తి కంపెనీలది.. నియంత్రణ కేంద్రానిది 

May 7 2021 4:29 AM | Updated on May 7 2021 8:29 AM

Difference Between The Production Requirement Of Covid Vaccines - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి, అవసరం మధ్య అంతులేని వ్యత్యాసం నెలకొంది. టీకాల ఉత్పత్తి పెంచడానికి చర్యలు చేపట్టి రాష్ట్రాలకు అవసరం మేరకు సరఫరా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా సేకరించేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించామంటూ చేతులు దులుపేసుకుంది. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కేంద్రం చెప్పిన కోటా మేరకు రాష్ట్రాలు డబ్బులు చెల్లించి వ్యాక్సిన్లు తీసుకోవాలే తప్ప వాటికి అవసరమైనన్ని డోసులను కొనేందుకు అవకాశం లేదు.

నిర్దేశించిన కోటా మేరకు ఉత్పత్తి సంస్థల నుంచి మీరే (రాష్ట్రాలే) టీకాలు కొనుక్కోవాలంటూ జాతీయ హెల్త్‌మిషన్‌ అదనపు సంచాలకులు వికాస్‌ షీల్‌ ఏప్రిల్‌ 29న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌సింఘాల్‌కు లేఖ రాశారు. ‘3.4 లక్షల డోసుల కోవాగ్జిన్, 9.9 లక్షల డోసులు కోవిషీల్డ్‌ మీకు కేటాయించాం.. మీరే కొనుక్కోండి’ అని లేఖలో పేర్కొన్నారు. కేంద్రం కేటాయించిన మేరకు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం మినహా మనకు అవసరమైనన్ని డోసులను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం పంపిన లేఖ స్పష్టం చేస్తోంది. 

దేశంలో నెలకు 3.5 కోట్ల మందికే...!
దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీలే కోవిడ్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ కోవీషీల్డ్‌ పేరిట,  భారత్‌ బయోటెక్‌ కోవ్యాగ్జిన్‌ పేరిట వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే. ఒక్కొక్కరికి రెండు డోసుల లెక్కన ఇస్తే దేశంలో నెలకు 3.5 కోట్లమందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయడం సాధ్యమవుతుంది.

ఈ లెక్కన దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే ఎన్ని నెలలు పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూలై, ఆగస్టు నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటామని ఆ రెండు కంపెనీలు చెబుతన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంపు ప్రణాళికలు వాస్తవరూపం దాలిస్తే రెండు కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం గరిష్టంగా నెలకు 16 కోట్ల డోసులకు చేరవచ్చు. రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి స్పుత్నిక్‌ టీకాకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అవి పరిమిత సంఖ్యలోనే అవి అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. 

ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 6 లక్షల మందికి టీకా..
దాదాపు 40 వేల మంది ఆశ కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు, వేలల్లో వైద్యులతోపాటు రెండు లక్షల మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో ఒక్క రోజులోనే 6 లక్షల మందికి కోవిడ్‌ వ్యాక్సిన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ లెక్కన నెలలో 25 రోజులు పనిచేసినా 1.50 కోట్ల మందికి  వ్యాక్సినేషన్‌ పూర్తి చేయవచ్చు. మన రాష్ట్ర జనాభా 5.30 కోట్లు కాగా ఇందులో వ్యాక్సిన్‌కు అర్హులు 3.48 కోట్ల మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే రాష్ట్రంలో ఎప్పుడో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేది. వ్యాక్సిన్లు అందుబాటులో లేని కారణంగానే ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు
వ్యాక్సిన్ల ఉత్పత్తి తగినంత లేదని, ఉన్న డోసులను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా మేరకు రాష్ట్రాలు కొనుగోలు చేయాలనే విషయం తెలిసి కూడా విపక్ష టీడీపీ రాజకీయాలు చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వాస్తవాలను విస్మరించి ఎలాగైనా ప్రభుత్వం మీద బురద జల్లి విపత్తు సమయంలోనూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

ఏపీలో రోజుకు వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం     6 లక్షల డోసులు
ఏపీలో 18 ఏళ్లు దాటిన జనాభా                     3.48 కోట్లు
మన రాష్ట్రానికి ఇప్పటివరకూ ఇచ్చినవి        73.49 లక్షల డోసులు
ఎన్ని అవసరం?                                          6.96 కోట్ల డోసులు 

మన రాష్ట్రంలో మే 6వ తేదీ వరకూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారు
కేటగిరి                                            మొదటిడోసు    రెండో డోసు
హెల్త్‌కేర్‌ వర్కర్స్‌                                  425971        282654
ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌                              786045        347761
45 ఏళ్ల పైన వారు                                 4141985    1161441
మొదటి డోసు మొత్తం                           5354001    1791861

దేశంలో 45 ఏళ్లు దాటిన వారికి టీకా ఇలా
ఎంతమందికి ఇవ్వాలి                26కోట్లు
ఎన్ని టీకాలు కావాలి                   52కోట్లు
మొదటి డోస్‌ తీసుకున్న వారు    12కోట్లు
రెండోది తీసుకున్న వారు             2.60 కోట్లు
ఇంకా అవసరం ఎన్ని డోసులు    37.40 కోట్లు
18 ఏళ్లు దాటిన వారు                  60 కోట్లు
వీళ్లకు ఎన్ని డోసులు    కావాలి    120 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement