వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. బాడుగల రేట్లు
ఇంధన కొరతతో మధ్యలో నిలిచిపోతున్న వాహనాలు.. పాడైపోతున్న కూరగాయలు
నగరాలు, పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి
ఒక్కసారిగా ధరల పెరుగుదలతో గగ్గోలు పెడుతున్న ప్రజలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సిండికేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ డీజిల్‌ను అడ్డదారిలో మళ్లించడంతో రవాణావాహనాలకు డీజిల్ దొరక్క నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే భారీగా పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఇప్పటికే సర్కారు నిర్వాకంతో వంట నూనెల ధరలు చుక్కలనంటుతుండగా ఆ జాబితాలో కూరగాయలు కూడా చేరాయి. డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఓవైపు డీజిల్ కొరతతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కూరగాయలు కుళ్లిపోతుండగా మరోవైపు సరఫరా ఆగిపోవడంతో ధరలు పెరిగిపోయి వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రమంతా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో పెరిగిన ధరల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు కథనం ఇదీ!
వారం రోజులుగా వాహనాల్లోనే వేల టన్నులు..
రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలకు కూరగాయలు, నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలకు చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో బ్రేకులు పడ్డాయి. రిటైల్ బంకులలో సాధారణ ప్రజలు వినియోగించే డీజిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిండికేట్ కాంట్రాక్టర్ల కోసం మళ్లించడంతో వ్యవస్థ గాడి తప్పింది. డీజిల్ దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి నిత్యావసరాలు మోసుకొచ్చే లారీలను హైవేల పక్కన రోజుల తరబడి నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా వేల టన్నుల కూరగాయలు వాహనాల్లోనే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి. మార్కెట్‌కు సరుకు రాకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లకు మదనపల్లె, కర్నూలు నుంచి టమాటా... బాపట్ల, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పచ్చిమిర్చి.. ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాదుంపలు.. కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లి.. కర్నాటకలోని కోలార్ నుంచి క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బీట్‌రూట్, కాలిప్లవర్ వస్తుండగా మిగిలిన కూరగాయలు కృష్ణా, గుంటూరు, గోదావరి లంక గ్రామాల నుంచి రవాణా అవుతుంటాయి. ఆకుకూరలు పూర్తిగా లంక గ్రామాలతో పాటు స్థానిక పల్లెల నుంచే వస్తుంటాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాలకు రోజూ 275–300 టన్నుల వరకు కూరగాయలు రవాణా అవుతుంటాయని అంచనా.
రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలు..
రాష్ట్ర పరిధిలో రోజుకు 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగమవుతుండగా అందులో 30 శాతానికి పైగా సరుకు రవాణా వాహనాలే వినియోగిస్తుంటాయి. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలుండగా 40 శాతం వాహనాలు పూర్తిగా కూరగాయలు, నిత్యావసరాలను చేరవేస్తుంటాయి. డీజిల్ సంక్షోభం మొదలైన తర్వాత ఇవి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. విశాఖ, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు రోజూ వచ్చే సరుకుల లోడు 30 నుంచి 40 శాతం తగ్గిపోయింది. రూ.కోట్ల విలువైన పంట ఉత్పత్తులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. మదనపల్లి, కర్నూలు, అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి, టమాటా లోడులతో బయల్దేరిన లారీలు డీజిల్ దొరక్క దారి మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చిందని చిత్తూరుకు చెందిన ఓ లారీ యజమాని ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉండిపోవడంతో ఎండవేడికి కూరగాయలు కుళ్లిపోతున్నాయి. డీజిల్ కొరతతో కిరాయిలు రెట్టింపు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20–30 శాతం పెరిగిన ధరలు
వేసవిలో ఉత్పత్తి తగ్గడం..దానికి డీజిల్ సంక్షోభం తోడు కావడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రైతులకు కిలో రూ.3–5కు మించి ధర లభించని టమాటా రిటైల్ మార్కెట్‌లో మూడు రెట్లు పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో కిలో రూ.15–20 పలికిన టమాటా ప్రస్తుతం రూ.45–55 పలుకుతోంది. మిగిలిన ప్రధాన కూరగాయల ధరలన్నీ 20–30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరలు సైతం 10–20 శాతం ధరలు పెరిగాయి. విజయవాడలోని ప్రధాన రైతుబజార్లలో ఈ నెల ప్రారంభంలో కిలో రూ.16 ఉన్న టమాటా ధర ప్రస్తుతం రూ.35కు చేరింది. వంగ రూ.20 నుంచి రూ.35కి ఎగబాకింది.
సకాలంలో రాకపోవడంతో..
డీజిల్ కొరత కారణంగా రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనాలు మధ్యలోనే నిలిచి పోయాయని చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సరుకు రాకపోవడంతో స్థానికంగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతోంది.
– గాదే వెంకటేశ్వరరావు, కూరగాయల వ్యాపారి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా
ఒక్కసారిగా పెరిగాయి..
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 15 రోజుల క్రితం వరకు నిలకడగా ఉన్న ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగిపోయాయి. టమాటా మూడు రెట్లు పెరిగింది. ఇతర కూరగాయల ధరలు కూడా రూ.10–30 వరకు పెరిగాయి. డీజిల్ కొరత కారణంగా వాహనాలు రావడం లేదు. సరుకు లేకపోవడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు.
– వన్నంరెడ్డి సురేష్, శ్రీనగర్ కాలని, విజయవాడ
జేబులకు చిల్లు పడుతోంది
ఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా ఉంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వమే పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డీజిల్ కొరత కారణంగా సరుకు రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.
– ఆత్మకూరి శ్రీనివాసరావు, పేరవలిపాలెం, బాపట్ల జిల్లా


