ఆస్తి కోసం కన్నకూతురి ఘాతుకం | Daughter Sets Fire To House Over Property Dispute At Palnadu District, Parents Narrow Escape | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కన్నకూతురి ఘాతుకం

Apr 30 2026 8:38 AM | Updated on Apr 30 2026 10:06 AM

Daughter Sets Fire to House Over Property Dispute at Palnadu District

పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టడంతో ఇంట్లో సామాగ్రి దగ్ధం  

చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు ప్రయత్నించిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లికార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సుకన్య, మల్లికార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. 

చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో  విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు తల్లిదండ్రుల వద్దే ఉంది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం..ఏడాది నుంచి ఆమె పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి మరో ప్రాంతంలో ఉంటుంది. తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. మంగళవారం రాత్రి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది.

 దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని  లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు.  దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచకు ఉన్న గ్రిల్స్‌ నుంచి లోనికి పెట్రోల్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు వంటివి తగలబడి పోయాయి. స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement