జీజీహెచ్ గేటు వద్ద ధర్నా చేస్తున్న చీకటి గోపి భార్య జ్యోతి కుటుంబసభ్యులు , చీకటి గోపీ(ఫైల్)
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
ముగ్గురు దళిత యువకులను స్టేషన్‌కు తీసుకువచ్చిన పోలీసులు
విచక్షణారహితంగా కొట్టడంతో స్పృహతప్పిన యువకుడు
కుటుంబ సభ్యులకు అప్పగించి, పిలిస్తే మళ్లీ రావాలని హెచ్చరిక
బాధిత యువకుడిని ఆస్పత్రిలోచేర్చిన కుటుంబీకులు
ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడి శ్వాస అందక మృతి
పోలీసులపై కేసు నమోదు చేయాలని మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించిన బంధువులు
తాడికొండ/గుంటూరు మెడికల్: రెడ్‌బుక్ రాజ్యాంగంలో పోలీసులు రెచ్చిపోయారు. ముగ్గురు దళిత యువకులపై దాష్టీకం ప్రదర్శించారు. ముగ్గురినీ స్టేషన్‌కు తీసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేక చలిజ్వరంతో బాధపడుతున్న యువకుడు ఒకరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో టీడీపీ నాయకుల ఫిర్యాదుతో అదే గ్రామానికి చెందిన చీకటి గోపీ (30), చిత్తజడ్ల గోపీ, నూతక్కి శాంతిరాజును గత నెల 26వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిని రెండు రోజులపాటు విచక్షణా రహితంగా కొట్టడంతో చీకటి గోపీ స్పృహతప్పి పడిపోయాడు. ఆగస్టు 28వ తేదీన కుటుంబ సభ్యులను పిలిపించి గోపీని అప్పగించిన పోలీసులు మళ్లీ తాము పిలిచినపుడు రావాలని హెచ్చరించి పంపారు. తనకు జ్వరంగా ఉందని కొట్టవద్దని వేడుకున్నా పోలీసులు కనికరించలేదని ఆవేదన చెందుతున్న గోపీని కుటుంబసభ్యులు తొలుత పొన్నెకల్లు పీహెచ్‌సీకి, తరువాత తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.
ఈ క్రమంలో ప్లేట్‌లెట్స్ పడిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఉన్నట్టు ఉండి ఆగస్టు 30న కాళ్లు చచ్చుబడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో గోపీని గుంటూరు పెద్దాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు మృతి చెందాడు. ఆటో డ్రైవర్ అయిన గోపీకి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తల్లి, అన్నతో కలిసి నివసిస్తున్నారు.
గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన
పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి ఆస్పత్రిలో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడంటూ గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి గేటు ఎదుట ఉంచి పోలీసులపై కేసు నమోదు చేసే వరకు పోస్టుమార్టం చేయవద్దని అడ్డం తిరిగారు. దాంతో మంగళవారం రాత్రి వరకు మృతదేహానికి పోస్టుమార్టం జరగని పరిస్థితి నెలకొంది. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు సతీష్ డిమాండ్ చేశారు.
నా భర్త మృతికి పోలీసులే కారణం
తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో తన భర్తను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొట్టి ఆయన మరణానికి కారకులయ్యారని పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి భార్య జ్యోతి మంగళవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లోని సీసీ కెమేరాల పుటేజీలు భద్రపరిచి, విచారణ చేపట్టాలని కోరారు.
తన భర్తకు వచ్చిన ఫోన్ కాల్స్, ఆస్పత్రి రికార్డులు, పోస్టుమార్టం రిపోర్టు, స్కానింగ్, ఇతర నివేదికలు పరిశీలించి నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి తన భర్త మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన భర్త మృతికి కారకులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సీఐ, ఎస్‌ఐలతో పాటు, విధుల్లో ఉన్న సిబ్బందిపైనా కేసు నమోదు చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


