పోలవరాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం 

CWC team examined Polavaram Project works - Sakshi

వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాలు పరిశీలన 

పూడ్చివేత విధానంపై సీడబ్ల్యూసీకి నివేదిక 

17న కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు నేతృత్వంలో సమీక్ష 

18న డీడీఆర్పీ సమావేశం

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డిజైన్స్‌ విభాగం డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో మెంబ్రేన్‌ బ్యాగ్‌లలో ఇసుకను నింపి పూడ్చుతున్న విధానాన్ని పరిశీలించింది. ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాలను, డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న భాగాలను తనిఖీ చేసింది.

క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైన అంశాలు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా ఇక్కడ చేపట్టాల్సిన పనులపై సీడబ్ల్యూసీ బృందం నివేదికను రూపొందించింది. దీనిపై ఈనెల 17న కేంద్ర జల్‌ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చిస్తారు. అనంతరం కోతకు గురైన ప్రాంతాలను పూడ్చివేసే విధానానికి మెరుగులు దిద్దుతారు. ఈనెల 18న జరిగే డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ) సమావేశంలో ఈ విధానంపై చర్చించి, ఆమోదించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.

పురుషోత్తపట్నం వద్ద డ్రెడ్జింగ్‌ చేస్తూ ఇసుకను ప్రధాన డ్యామ్‌ వద్ద కోతకు గురైన ప్రాంతాల్లోకి పొరలు పొరలుగా పంపింగ్‌ చేస్తూ వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా పటిçష్టపరచాలని రాష్ట్ర జలవనరుల అధికారులు ప్రతిపాదించారు. డయా ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రాంతాల్లో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ వేసి పాత దానికి అనుసంధానం చేసే పద్ధతిని కూడా ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం బృందంలో డైరెక్టర్‌ రాహుల్‌ కుమార్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్లు సోమేష్‌కుమార్, అశ్వని కుమార్‌ వర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ తివారీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్‌ పి.దేవందర్‌రావు ఉన్నారు. ప్రాజెక్టు పనులను సీఈ సుధాకర్‌బాబు వారికి వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top