
వాతావరణ మార్పుల ప్రభావం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో వాతావరణ మార్పులు వరి, గోధుమ, మొక్కజొన్న దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతాయని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అధ్యయనంలో తేలింది. అధ్యయన వివరాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భూసారం, వర్షపాతం, పంట దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం అంచనా కోసం ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. అధ్యయనంలో కొన్ని ముఖ్యాంశాలు..
» వాతావారణ మార్పులతో ఖరీఫ్‌లో వర్షపాతం 2050 నాటికి 10.1 శాతం వరకు పెరగవచ్చు. 2080 నాటికి 18.9 శాతం పెరిగే అవకాశం ఉంది. రబీల్లో కూడా 2050 నాటికి 17 శాతం, 2080 నాటికి 26 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అసమాన, భారీ వర్షపాతాలు దిగుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.
» లవణీయతకు (నీటిలో కరిగిన ఉప్పు శాతం) లోనయ్యే భూముల విస్తీర్ణం 2030 నాటికి 6.7 మిలియన్ హెక్టార్ల నుండి 11 మిలియన్ హెక్టార్ల మేర పెరుగుతుంది.
» వాతావరణ మార్పులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోకపోతే వర్షాధారిత వరి దిగుబడి 2050 నాటికి 20 శాతం, 2080కి 47 శాతం మేర తగ్గుతుంది. నీటి పారుదల ఆధారిత వరి దిగుబడి 2050 నాటికి 3.5 శాతం, 2080 నాటికి 5 శాతం మేర పడిపోతుంది. గోధుమ దిగుబడి కూడా 2050 నాటికి 19.3 శాతం, 2080 నాటికి ఏకంగా 40 శాతం మేర తగ్గుతుంది. ఖరీఫ్ మొక్కజొన్న దిగుబడి 2050 నాటికి 19 శాతం వరకు, 2080 నాటికి 20 శాతం వరకు తగ్గుతుంది.
తగిన చర్యలు తీసుకుంటున్నాం: వ్యవసాయ శాఖ
వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయ రంగంపై పడే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ సాంకేతికత అభివృద్ధి, పంట వైవిధ్య, భూసార పరిరక్షణ, సమగ్ర నీటి లభ్యతా చర్యలు చేపట్టినట్లు వివరించింది. 76 ప్రోటోటైప్ ఇంటిగ్రేటెడ్ ఫారి్మంగ్ సిస్టమ్ నమూనాలను ఐసీఏఆర్ అభివృద్ధి చేసినట్లు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.