దారి మళ్లిన యూరియా.. | Urea which was to be supplied to societies was diverted | Sakshi
Sakshi News home page

దారి మళ్లిన యూరియా..

Aug 22 2025 5:13 AM | Updated on Aug 22 2025 5:19 AM

Urea which was to be supplied to societies was diverted

ఈ ఫొటోలో మండుటెండలో నేలపై కూర్చొని ఉన్నది విజయనగరం జిల్లా కుంటినివలస రైతులు. యూరియా కోసం రైతు సేవా కేంద్రం వద్ద రోజంతా నిరీక్షించగా.. సాయంత్రం కొందరికే ఇచ్చి ఇక స్టాక్‌ లేదని చేతులెత్తేశారు. , అనంతపురంలో విలపిస్తున్న రైతు ఓబుళమ్మ

సరైన సమయంలో ఎరువు దొరక్క అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు

ప్రైవేట్‌ దుకాణాలకు కొంత.. ఇతరత్రా వ్యాపారాలకు మరికొంత మళ్లింపు 

సొసైటీలకు రావాల్సిన లోడ్‌లు టీడీపీ నేతల గోడౌన్లకు.. ప్రభుత్వం చెబుతున్న దానికి.. క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతనే లేదు 

రాష్ట్రంలో ప్రస్తుతం 6.45 లక్షల టన్నుల నిల్వలున్నాయంటున్న ప్రభుత్వం 

ఇందులో సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్‌ వద్ద ఉన్నది 1.20 లక్షల టన్నులే 

మిగతా అంతా ప్రైవేటు హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల వద్దే బ్లాక్‌.. 

చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేకపోతున్న అధికార గణం  

అందువల్లే ఆర్‌ఎస్‌కేలు, సొసైటీల్లో నో స్టాక్‌ బోర్డులు 

ఇదే సాకుతో బహిరంగ మార్కెట్‌లో నిలువు దోపిడీ 

నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు అధిక ధరతో కొనుగోలు 

గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితే లేదని రైతుల ఆవేదన

సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్‌, ప్లైవుడ్, యాడ్‌–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.

ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్‌ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్‌ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్‌కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్‌లోడ్‌ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్‌ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్‌ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్‌ డోస్‌ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్‌ ఆఫ్‌ పొటాష్‌ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్‌ స్టాక్‌ నిర్వహణలో మార్క్‌ఫెడ్‌ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. 

కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్‌ స్టాక్‌ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 
2025– ఖరీఫ్‌ సీజన్‌ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. 

ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్‌ఎస్‌కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్‌ఫెడ్‌ గోడౌన్‌లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్‌సేల్, రిటైల్‌ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు  

ఎమ్మార్పీకి మించి విక్రయాలు 
బహిరంగ మార్కెట్‌లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్‌ మార్కెట్‌లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి.  

చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి 
అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌తో పాటు ప్రైవేట్‌ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు.  చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. 

‘ఈ ఖరీఫ్‌కు సంబంధించి ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 26,839 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్‌హౌస్‌లో బఫర్‌ స్టాక్‌ కింద 1,000 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?
ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు 

అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు  
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.  

⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది.  

పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు  

⇒ వైఎస్సార్‌ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే  8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు.   

⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్‌బీకేలు, పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.  

⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు.  

⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్‌ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు.  

ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు 
మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్‌బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు.   
    – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లా

అధిక ధరకు అమ్ముతున్నారు 
పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం.   
– పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లా

గత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారు
నేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తు­న్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్‌ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. 
    – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా  

266 బస్తాల యూరియా లారీ పక్కదారి 
మంత్రి ఫరూక్‌ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం  
సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్‌ఫెడ్‌ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. 

టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్‌ఫెడ్‌ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్‌ హార్టీకల్చరల్‌ అసిస్టెంట్‌ (వీహెచ్‌ఏ) శ్రీకాంత్‌రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. 

అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు.  ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్‌ఏ శ్రీకాంత్‌రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్‌ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement