బెయిల్‌ పిటిషన్‌లో నేర చరిత్రను చెప్పాల్సిందే | Criminal history must be mentioned in bail petition | Sakshi
Sakshi News home page

బెయిల్‌ పిటిషన్‌లో నేర చరిత్రను చెప్పాల్సిందే

Jul 3 2026 3:55 AM | Updated on Jul 3 2026 3:55 AM

Criminal history must be mentioned in bail petition

సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి ఉంటే ఆ విషయం కూడా చెప్పాలి  

సుప్రీంకోర్టు తీర్పు గురించి బెయిల్‌ పిటిషన్‌లో పొందుపరచాలి  

క్రిమినల్‌ కేసుల వివరాలు.. ఆ కేసుల్లో కింది కోర్టు తీర్పులు తెలియజేయాలి 

బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టు కీలక నిబంధన  

తన స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు సవరణ  

తక్షణమే అమల్లోకి తెచ్చిన హైకోర్టు  

సాక్షి, అమరావతి: బెయిల్‌ కోసం పిటిషన్లు దాఖలు చేసే నిందితులు తమ నేరచరిత్రను దాచిపెట్టి బెయిల్‌ పొందుతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తన స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు కీలక సవరణ చేసింది. హైకోర్టులో దాఖలు చేసే బెయిల్‌ పిటిషన్‌లో నిందితుడు తన నేరచరిత్రను తెలియజేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు హైకోర్టు స్టాండింగ్‌ ఆర్డర్స్‌లో కఠినమైన కొత్త నిబంధన చేర్చింది. హైకోర్టులో దాఖలు చేసే ప్రతి బెయిల్‌ పిటిషన్‌లో.. సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్‌ను ఏదైనా దాఖలు చేశారా? లేదా? అనే విషయాన్ని పిటిషనర్‌ తప్పనిసరిగా పేర్కొనాలి. 

ఒకవేళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి ఉంటే దాని ఫలితాన్ని కూడా బెయిల్‌ పిటిషన్‌లో తెలియజేయాలి. అంతేగాక పిటిషనర్‌/దరఖాస్తుదారు తనపై మరేదైనా క్రిమినల్‌ కేసు ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా పేర్కొనాలి. ఒకవేళ క్రిమినల్‌ కేసులు ఉంటే వాటి వివరాలు, ఆ కేసుల్లో కోర్టుల నిర్ణయాలను (తీర్పులను) కూడా పిటిషనర్‌ తన బెయిల్‌ పిటిషన్‌లో తెలియజేయాలి. ఒకవేళ ఈ సమాచారాన్ని బెయిల్‌ పిటిషన్‌లో పొందుపరచకపోతే, ఆ వివరాలను తెలుసుకున్న తరువాతే ఆ పిటిషన్‌ విచారణకు వస్తుంది. హైకోర్టు ఈ సవరణ ఆర్డర్‌ను తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనతో న్యాయపరమైన ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.

కుమ్మక్కు ఆటలు సాగవు  
ఇప్పటివరకు నిందితులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు అందులో కేవలం సదరు కేసుకు సంబంధించిన వివరాలను మాత్రమే పొందుపరిచేవారు. నేరచరిత్రను, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ల వివరాలను ప్రస్తావించేవారు కాదు. దీంతో కోర్టుకు సదరు నిందితుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం లేకపోయేది. తద్వారా బెయిల్‌ మంజూరు విషయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. బెయిల్‌ మంజూరు విషయంలో న్యాయస్థానాలు ఇటీవల కాలంలో నిందితుడి నేరచరిత్రను తప్పనిసరిగా తెలుసుకుంటున్నాయి. 

గతంలో ఎలాంటి కేసులు నమోదయ్యాయి.. వాటి తీవ్రత ఏమిటన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అయితే నిందితుడి నేరచరిత్ర వివరాలను పోలీసులే కోర్టు ముందుంచాల్సి వచ్చేది. కొందరు పోలీసులు నిందితులతో కుమ్మక్కై వారి నేరచరిత్రను కోర్టు ముందుంచకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేవారు. తద్వారా నిందితులకు బెయిల్‌ వచ్చేందుకు పోలీసులు తమవంతు సహకారం అందించేవారు. అంతేగాక నిందితులు తమపై గతంలో నమోదైన కేసుల్లో కోర్టులు ఇచ్చి న తీర్పుల గురించి కూడా బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొనేవారు కాదు. దీంతో సదరు నిందితుడి నేరస్వభావాన్ని తెలుసుకునే అవకాశం హైకోర్టుకు లేకుండాపోయేది. అంతిమంగా సులభంగా బెయిల్‌ మంజూరుకు ఆస్కారం ఉండేది. 

ఇప్పుడు హైకోర్టు తీసుకొచ్చి న కొత్త నిబంధన వల్ల ఇకపై ఈ ఆటలు సాగవు. నిందితులే స్వయంగా తమ బెయిల్‌ పిటిషన్‌లో తమ నేరచరిత్రను, గతంలో నమోదైన కేసుల వివరాలను, ఆ కేసుల్లో కోర్టులిచ్చి న తీర్పులను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఇకపై తీవ్రనేరాల్లో బెయిల్‌ పొందడం అంత సులభం కాదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement