Ongole: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌.. మెనూ అదుర్స్‌

Corona Care: Best Facilities And Menu In Ongole Covid Care Centre - Sakshi

ఒంగోలు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో రుచికరమైన వంటకాలు 

బాధితులకు అందించే భోజనంలో రాజీ మాటే లేదు 

ఇక్కడ చేరినవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇళ్లకు 

ఆదర్శంగా నిలుస్తున్న ఒంగోలు కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

ఒంగోలు టౌన్‌: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఈ రెండింటిని పాటిస్తే రోజుల వ్యవధిలోనే కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఈ రెండూ ఒంగోలులోని పాత ట్రిపుల్‌ ఐటీ కాలేజీలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉంటున్న కరోనా బాధితులకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ మొత్తం 500 పడకలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు కలిగి ఉండి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం లేనివారిని ఇక్కడ ఉంచుతున్నారు.

ప్రస్తుతం 170 మంది ఈ సెంటర్‌లో ఉంటున్నారు. వారందరి ఆరోగ్యాన్ని చూసేందుకు 24/7 కింద వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. అదే సమయంలో వారు మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉండేందుకు ఉపశమన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. భోజన తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నారు. దాంతో రుచికరమైన భోజనాన్ని ఆహారంగా తీసుకుంటూ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు.

 

మెనూ అదుర్స్‌ 

  • పాత ట్రిపుల్‌ ఐటీ కాలేజీలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉండేవారికి నిర్ణీత మెనూ ఉంది.
  • సోమవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 7 గంటలకు బెల్లం, పాలు కలిపిన రాగిజావ అందిస్తారు.
  • 8.30 గంటలకు మూడు పూరి లేదా మూడు చపాతి ఆలుబఠాని కుర్మాతో అందిస్తారు. టీ లేదా కాఫీ ఇస్తారు.
  • మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నం 300 గ్రాములు, చపాతి 150 గ్రాములు, చికెన్‌ కర్రీ 150 గ్రాములు, వెజ్‌ కర్రీ 100 గ్రాములు, పప్పుకూర 75 గ్రాములతో పెడతారు.
  • ఆకుకూర కర్రీ 75 గ్రాములు, సాంబారు రైస్‌ 100 గ్రాములు, రసం 100 గ్రాములు, పెరుగు 100 గ్రాముల చొప్పున ఇస్తారు.
  • వీటితోపాటు ఒక పండు కూడా అందిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు టీ, బిస్కెట్‌ ఇస్తారు.
  • రాత్రి 7.30 గంటలకు అన్నం 300 గ్రాములు, చపాతి 150 గ్రాములు, ఉడికిన గుడ్లు రెండు, చట్నీ లేదా వెజ్‌కర్రీ 100 గ్రాములు.
  • పప్పుకూర 75 గ్రాములు, ఆకు కర్రీ 75 గ్రాములు, సాంబారు రైస్‌ 100 గ్రాములు, రసం 100 గ్రాములు, పెరుగు 100 గ్రాముల చొప్పున ఇస్తారు.
  • వారం రోజులపాటు అందించే మెనూలో అల్పాహారం కింద అందించే వాటిలో మాత్రం అక్కడ ఉండేవారి అభిరుచి మేరకు స్వల్ప మార్పులు చేస్తూ ఉంటారు.
  • మంగళవారం ఇడ్లీ రెండు, వడ, బుధవారం ఉప్మా 75 గ్రాములు, వడ రెండు, గురువారం ఉప్మా 75 గ్రాములు, ఊతప్పం, శుక్రవారం కిచిడి, చపాతి చేసి వాటికి ఆలుబఠాని కర్రీ కాంబినేషన్‌గా ఇస్తారు.
  • శనివారం పులిహోర, దానికి కాంబినేషన్‌గా చట్నీ ఇస్తారు.
  • ఆదివారం టమాటా బాత్, పొంగలి ఇస్తారు. 

మెనూలో రాజీ పడేది లేదు
పాత ట్రిపుల్‌ ఐటీ కాలేజీలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉండేవారికి అందించే మెనూ విషయంలో రాజీ పడేది లేదు. ఇక్కడకు వచ్చేవారికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఆహారం కూడా అంతే ముఖ్యంగా భావించి వాటిని తయారు చేయిస్తున్నాం. కలెక్టర్‌ పోల భాస్కర్‌ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. ఇక్కడ ఉండేవారి అభిప్రాయాలను కూడా తీసుకొని వారికి అనుగుణంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం. ఇక్కడకు వచ్చినవారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వెనుదిరుగుతున్నారంటే అందులో ఇక్కడ అందించే భోజనం ముఖ్య భూమిక పోషిస్తోంది.  
– ఉపేంద్ర, సెంటర్‌ నోడల్‌ అధికారి

చదవండి: రాగి జావ.. కొర్ర బువ్వ..జొన్న రొట్టె..!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top