డబ్బులిస్తే కోరుకున్న చోట కొలువు! | Conspiracy in promotions of deputy tehsildars: Andhra pradesh | Sakshi
Sakshi News home page

డబ్బులిస్తే కోరుకున్న చోట కొలువు!

May 30 2026 6:22 AM | Updated on May 30 2026 6:22 AM

Conspiracy in promotions of deputy tehsildars: Andhra pradesh

డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతుల్లో పైరవీల జోరు

సాక్షి, అమరావతి: డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీ) తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించే  ప్రక్రియ సీసీ­ఎల్‌ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాల­యం) సర్విసెస్‌ విభాగ అధికారులకు కాసుల పంట పండిస్తోంది. సర్విస్‌ సబార్డినేట్‌ రూల్స్, సీనియారిటీతో సంబంధం లేకుండా ముడుపులు ఇచ్చిన వా­రికి కోరుకున్న జిల్లాలను కేటాయించేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయి. సర్విసెస్‌ విభాగం అధికారి, సంబంధిత సెక్షన్‌ అధికారి, ఆయన వద్ద పని చేసే ఆన్‌ డ్యూటీ ఆర్‌ఐ ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు రెవెన్యూ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. 

వారు ఎన్ని తప్పులు చేసినా, పైరవీలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తినా సీసీఎల్‌ఏ ముఖ్య ఉన్నతాధికారి పట్టించుకోకుండా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తు­తం డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతుల అంశం రెవెన్యూ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డీటీలు, కింద నుంచి పదోన్నతిపై వచ్చిన డీటీలందరితో ఒక జాబితా తయారు చేసి.. వారికి తహశీల్దార్‌గా పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇటీవల హైకోర్టు సూచించింది. దీంతోరాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఏర్పడింది. వీరందరికీ పదోన్నతులు రావడం ఖా­యమైనా, జిల్లాల కేటాయింపు కీలకంగా మారింది.

ముడుపులిస్తే కావాల్సిన జిల్లాలకు కేటాయింపు
1996 సర్విస్‌ సబార్డినేట్‌ రూల్సు ప్రకారం సీనియారిటీ, పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల కేటాయింపు జరగాలి. వీటి ఆధారంగా డీపీసీ (డి్రస్టిక్ట్‌ ప్రమోషన్‌ కమిటీ)లో పదోన్నతులు ఖరారు చేసి జిల్లాలు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ఆ జిల్లాల్లో పని చేస్తున్న వారు, పలు జిల్లా­ల్లో ఫోకల్‌ మండలాలపై కన్నేసిన డీటీలు నేరుగా సీసీఎల్‌ఏ కార్యాలయానికి వచి్చ.. సర్వీసెస్‌ విభాగంలోని ముఖ్యులతో బేరమాడి సెట్‌ చేసుకుంటున్నారు.

కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసు లే­ఖ­లు తీసుకు వెళ్లినా, తమకు ముడుపులు ఇవ్వాల్సిందేనని చెబుతుండడంతో వారితో బేరం కుదుర్చుకుని ఆ మేరకు డబ్బు ఇస్తున్నారు. సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా, సర్వీసెస్‌ విభాగం అధికారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా.. ముఖ్య ఉన్నతాధికారి మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

‘ఆయన’పై ఆది నుంచి ఆరోపణలే
సర్విసెస్‌ విభాగం అధికారి ఆ సీటులోకి వచ్చినప్పటికీ నుంచి చేయి తడపకపోతే ఫైలు కదలడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం అదే సెక్షన్‌లో ఆన్‌ డ్యూటీ ఆర్‌ఐని ఉపయోగించుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలపై ఏడాది క్రితం అతన్ని వేరే సెక్షన్‌కి మార్చితే, ఆ అధికారి పట్టుబట్టి మళ్లీ తన వద్ద వేయించుకున్నారు. సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి తహశీల్దార్‌గా వెళ్లే అధికారిని కాకుండా, డబ్బు తీసుకుని సచివాలయం నుంచి తహశీల్దార్‌గా వెళ్లే అధికారిని నెల్లూరు జిల్లాకు పంపించడంపై గతంలో వివాదం ఏర్పడి ఉన్నతాధికారుల వద్ద పంచాయితీ కూడా జరిగింది. 

డిప్యూటీ కలెక్టర్ల పే ఫిక్సేషన్, బకాయిల సెటిల్మెంట్, ఇతర సర్విస్‌ వ్యవహారాలన్నింటికీ ఆయన డబ్బు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అనేకం వచ్చాయి. అయినా ప్రస్తుతం ఆ అధికారికే డిప్యూటీ తహశీల్దార్ల పదోన్నతుల జాబితా ప్రక్రియను అప్పగించారు. దీంతో ప్రస్తుతం సీసీఎ­ల్‌ఏ కార్యాలయం పైరవీకారులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఫలితంగా సీనియారిటీ ఉండి, నిబద్ధతతో పనిచేసే డీటీల పరిస్థితి అయోమయంగా మారడంతో వారు లబోదిబోమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement