ఆరోగ్య బీమాలో కమీషన్ల స్కామ్‌ | Commission Scam in Health Insurance: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆరోగ్య బీమాలో కమీషన్ల స్కామ్‌

Mar 30 2026 6:11 AM | Updated on Mar 30 2026 6:11 AM

Commission Scam in Health Insurance: Andhra pradesh

హౌసింగ్‌ కార్పొరేషన్‌ టెండర్‌లో అక్రమానికి తెరలేపిన సర్కార్‌

అస్మదీయ బ్రోకింగ్‌ ఏజెన్సీలను అడ్డదారిలో ఎంపానెల్‌ చేస్తున్న ప్రజాప్రతినిధి, కీలక అధికారి  

ఇప్పటికే ఓ ఏజెన్సీతో ఎంపానెల్మెంట్‌.. మరో సంస్థను కూడా చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో గుట్టురట్టు  

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్‌ బీమా కార్యక్రమాల అమలులో అక్రమాలకు తెగబడుతోంది. బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పాతరేస్తోంది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య బీమా పథకంలో కీలక ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి కమీషన్లు దండుకునేలా అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్‌ బోర్డు ఆమోదం లేకుండానే ఓ బ్రోకింగ్‌ ఏజెన్సీని గుట్టుచప్పుడు కాకుండా ఎంపానెల్‌ చేసుకున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో మరో ఏజెన్సీని సైతం ఎంపానెల్‌ చేయడానికి ప్రయత్నాలు సాగుతుండగా ఈ అడ్డగోలు వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

అస్మదీయ ఏజెన్సీకి అడ్డగోలు కేటాయింపు
హౌసింగ్‌ కార్పొరేషన్‌ సుమారు 1,700 కుటుంబాలు, 4 వేల మందికిపైగా వ్యక్తుల ఆరోగ్య బీమా కోసం ఏటా గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ చేస్తుంటుంది. 2025–26 హెల్త్‌ పాలసీ గడువు వచ్చే నెలలో ముగియనుంది. దీంతో 2026–27 పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా కమీషన్లు పొందడానికి అస్మదీయ బ్రోకింగ్‌ ఏజెన్సీల ద్వారా పావులు కదుపుతున్నారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. 2021 నుంచి ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లు పిలిచేది.

ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ) విధానంలో ముందుకొచ్చిన బ్రోకింగ్‌ ఏజెన్సీలను వడపోసి అనుభవం ఉన్న రెండు ఏజెన్సీలను గుర్తించేవారు. అనంతరం బోర్డు అనుమతించిన ఓ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎంపికకు సాంకేతిక షరతులు రూపొందించేవారు. ఈ విధానానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఓ బ్రోకింగ్‌ ఏజెన్సీని ఎంపానెల్‌ చేయడమే కాకుండా సదరు సంస్థలో పనిచేసే ఉన్నతాధికారికి సన్నిహితుడైన వ్యక్తికి ఉద్యోగులు, వారి కుటుంబాల వైద్య సేవల వినియోగం డేటాను ఇచ్చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని సదరు వ్యక్తే ఇన్సూరెన్స్‌ కంపెనీ వర్గాలతో పంచుకున్నాడని వెల్లడైంది.   

Advertisement
 
Advertisement
Advertisement