రూటు మార్చిన కేటుగాళ్లు | Collecting money in the name of officials | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన కేటుగాళ్లు

May 11 2025 5:21 AM | Updated on May 11 2025 5:21 AM

Collecting money in the name of officials

అధికారుల పేరుతో  డబ్బు వసూలు

సత్యసాయి జిల్లాలో నకిలీ అధికారుల హల్‌చల్‌ 

పన్నుల పేరిట ఆన్‌లైన్‌లో దందా 

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పేరుతో చిల్లర రాబడుతున్న వైనం

ఈనెల 8న సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్‌ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్‌  చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

సాక్షి, పుట్టపర్తి : ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్‌ కాల్స్‌ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నా­రు. మోసపోయామని బాధితులు తెలుసుకునే­లోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్‌ స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సత్యసాయి జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి.  

పెరిగిన సైబర్‌ నేరాలు 
హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్‌ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్‌ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రా­ల­కు చెందిన వారు సమూహంగా ఏర్ప­డి.. కొత్త కొత్త మొబైల్‌ నంబర్ల నుంచి కాల్‌ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్‌ లోన్‌ అప్రూవల్‌ అయిందని.. ట్యాక్స్‌ ఆన్‌లైన్‌లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నా­రు. 

నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. 
రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్‌ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు  అక్కడి నుంచి పరారయ్యారు.  

అధికారులపైనే ఆరోపణలు 
కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు.

అప్రమత్తత అవసరం
సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్‌ ద్వారా వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే షేర్‌ చేయరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదు. అధికారులపై ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రజల సహకారంతోనే సైబర్‌ నేరాల కట్టడి సాధ్యం.   – వి.రత్న, జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement